అమరావతిలో ‘రేలా’ ఆసుపత్రి

2 Jun, 2018 21:03 IST|Sakshi
డా. రేలా (పాత ఫొటో)

సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అవయవ మార్పిడి ఆసుపత్రి నిర్మాణానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అవయవ మార్పిడి నిపుణులు, భారత్ విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ డా.మహమద్ రేలా ముందుకు వచ్చారు. శనివారం సాయంత్రం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. మనిషి  ప్రధాన అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెంటర్‌ని అమరావతిలో నిర్మించాలని అనుకుంటున్నట్లు ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు.

గుండె, కిడ్నీ, కాలేయం, లంగ్స్, యూట్రిస్ వంటి ప్రధాన శరీర అవయవాలను ఒక మనిషి నుంచి వేరొక మనిషికి శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయవచ్చని సీఎంకు విన్నవించారు. కాగా, డాక్టర్‌ రేలా ఇప్పటివరకూ 4,500 లివర్ మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

కుమార్తెకు పిల్లలు పుట్టకపోతే ఓ తల్లి తన యూట్రెస్‌ను కుమార్తెకు దాన చేసిందని, ఆ ఆపరేషన్‌ వల్ల కుమార్తెకు బిడ్డ జన్మించినట్లు రేలా వెల్లడించారు. అమరావతిలో ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాల భూమి అవసరం అవుతుందని, అందుకు సహకారం అందించాలని సీఎంను రేలా కోరారు. అమరావతిలో అవయవాల మార్పిడికి సంబంధించిన ఆసుపత్రి నిర్మాణం పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.

ప్రతిపాదనలకు సంబంధించిన పూర్తి వివరాలతో వస్తే అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని ముఖ్యమంత్రి డాక్టర్ రేలాకు హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎం.అప్పారావు, డాక్టర్ రమేష్ కృష్ణన్, డాక్టర్ వి.చౌదరి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

మరిన్ని వార్తలు