అవయవదానంతో ఆరుగురికి ఊపిరి

1 Nov, 2023 04:28 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌: తను శ్వాసను వదలి పెట్టి..మరో ఆరుగురికి ఊపిరి ఉదాడు. తను తనువు చాలిస్తూ ఐదు కుటుంబాల్లో వెలుగులు నింపాడు. కొండంత కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు..ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే భర్తను కోల్పోయిన భార్య పెద్ద మనసుతో తీసుకున్న ఆ నిర్ణయం ఆరుగురి ప్రాణాలు నిలబెట్టింది. బ్రెయిన్‌డెడ్‌కు గురైన ఓ వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో ఆరుగురు వ్యక్తులకు ప్రాణం పోసేందుకు సికింద్రాబాద్‌ కిమ్స్‌ డాక్టర్లు సిద్ధమవుతున్నారు. వివరాలలోకి వెళితే ఏపీలోని నెల్లూరు పట్టణం గౌతంనగర్‌ ప్రాంతానికి చెందిన అనంతరెడ్డి, సంపూర్ణమ్మల కుమారుడు హనుమాన్‌రెడ్డి (46) హైదరాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. భార్య విజయారెడ్డి, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఈ నెల 29వ తేదీన తీవ్రమైన తలనొప్పి రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తీసుకుని వచ్చారు. రోగిని పరిశీలించిన వైద్యులు తలలో బ్లడ్‌ క్లాట్స్‌ అయ్యాయని గుర్తించారు. అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు మూడు రోజుల పాటు శ్రమించినా మంగళవారం ఉదయం బ్రెయిన్‌ డెడ్‌కు గురి కాగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు.

కిమ్స్‌లోని అవయవదాన సమన్వయకర్తలు మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. ఆయన మరణించినా మరికొంత మంది ప్రాణాలు నిలబెడతారని వారు వివరించారు. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగుకుంటూనే తల్లిదండ్రులు, భార్యా, కుమారులు ఓ గొప్ప కార్యానికి అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు ఆయన రెండు కిడ్నీలు, లంగ్స్‌, లివర్‌, రెండు కార్నియాలను సేకరించి వారికి అప్పగించారు. వీటిని జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకుని దాతల కోసం ఎదురు చూస్తున్న వారికి అందిస్తామని జీవన్‌దాన్‌ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు