జరిగేది జంబ్లింగే!

19 Jan, 2016 23:46 IST|Sakshi
జరిగేది జంబ్లింగే!

స్పష్టతనివ్వడంతో  ఏర్పాట్లలో జిల్లా అధికారులు
64 కేంద్రాల్లో ఇంటర్ ప్రయోగ పరీక్షలు
సగం ప్రైవేట్ కళాశాలల్లోనే ప్రయోగ పరికరాలు  హాజరుకానున్న
33,742 మంది విద్యార్థులు తనిఖీలకు నాలుగు స్క్వాడ్లు

 
విశాఖపట్నం: ఈసారైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ ఉంటుందా.. ఉండదా.. అన్న సందేహాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఫిబ్రవరిలో జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా జంబ్లింగ్ విధానం ప్రవేశపెడతామని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు సమీపించే సమయానికి వెనక్కు తగ్గడం అలవాటుగా మారింది. ఈ ఏడాది తప్పనిసరిగా జంబ్లింగ్ అమలు చేస్తామని ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ప్రకటించింది. ఇంతలో ప్రయోగ పరీక్షలకు అవసరమైన పరికరాల కొరత ఉందన్న అంశాన్ని ప్రైవేటు కాలేజీలు తెరపైకి తెచ్చాయి. దీంతో జంబ్లింగ్ అమలుపై నీలినీడలు అలముకున్నాయి. ఒకపక్క ప్రయోగ పరీక్షలుంటాయని అధికారులు, ఉండకపోవచ్చని ప్రైవేటు కళాశాలల నిర్వాహకులు చెబుతూ వచ్చారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జంబ్లింగ్ విధానాన్ని ఖరారు చేస్తూ మంగళవారం ఇంటర్మీడియట్ కమిషనర్, కార్యదర్శులు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ తనిఖీ అధికారుల (ఆర్‌ఐఓల)తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జంబ్లింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని  ఆదేశించారు. విధివిధానాలను సూచించారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్‌ఐవో తమర్బ నగేష్ ప్రాక్టికల్ పరీక్షలు జరిగే ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం తన కార్యాలయంలో సమావేశమాయ్యరు.
 
64 కేంద్రాల ఎంపిక
ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం  విశాఖ జిల్లా, నగరంలో మొత్తం 64 కేంద్రాల ను ఎంపిక చేశారు. వీటిలో 23 ప్రభుత్వ, 11 ఎయిడెడ్, మూడు సాంఘిక సంక్షేమ, రెండు గిరిజన సంక్షేమ కళాశాలలు, 24 ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 33,742 మంది విద్యార్థులు ప్రయోగ పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షా కేంద్రాల తనిఖీలు, పర్యవేక్షణకు నాలుగు స్క్వాడ్లను నియమిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు