ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆదిలోనే ఇక్కట్లు

9 Feb, 2014 06:12 IST|Sakshi

కాసిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం  ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా యాభై యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ఆదివాసీ గిరిజనులకు కలగానే మిగలనుంది. ఉచిత విద్యుత్ అందించాలంటే సంబంధిత కులధ్రువీకరణ పత్రాలు అందించాలని అధికారులు స్పష్టం చేయడంతో గిరిజనులకు అవగహన లేక మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

 అయినా.. వారికి సర్టిఫికెట్లు అందడం లేదు. సర్టిఫికెట్లు అందించె గడువు ముగిసినా నేటికీ 50 శాతం మంది కూడా ధ్రువీకరణపత్రాలు ఇవ్వలేదు. కాసిపేట మండలంలో మొత్తం 3,100 కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినవిగా నమోదయ్యాయి. వీరంతా ఉచిత విద్యుత్‌కు అర్హులు కాగా.. ఇప్పటి వరకు కేవలం 650 మంది (22శాతం) మాత్రమే కులధ్రువీకరణ పత్రాలు అందించారు.

గిరిజనులకు అవగహన కల్పించాల్సి ఉన్నా.. అధికారుల సహకారం ఆ దిశగా కనిపించడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు గ్రామాల వారిగా మీటర్ల నంబర్ల ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారుచేసి రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అయితే.. అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. ఒక్క బల్బు మాత్రమే వాడే మారుమూల ప్రాంతాల ఆదివాసీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే పత్రాలు అందించడంపై ఎంత వెనకబడి పోయారో తెలుస్తోందని, ప్రభుత్వ పథకం గిరిజనులకు అందకుండా చేయడం దారుణమని, గడువుపెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు