మంత్రి నారాయణకు ప్రొటోకాల్ తెలియదా?

29 Apr, 2016 21:39 IST|Sakshi

పెళ్లకూరు: ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ తదితర ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలన్న ప్రొటోకాల్ మంత్రి పి.నారాయణకు తెలియదా? అంటూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరుజల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రశ్నించారు.

శుక్రవారం పెళ్లకూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశానికి తనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిలివేటి, ఎంపీపీ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు గునిశెట్టి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షుడు కట్టా బాలసుబ్రమణ్యం సభా ప్రాంగణంలో నేలమీద కూర్చొని నిరసన తెలిపారు. సభా మర్యాదలు తెలియకుండా వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతలకు కనువిప్పు కలగాలని నినాదాలు చేశారు.

10 మంది ఎంపీటీసీ సభ్యులు, 19 సర్పంచ్‌లతో పాటు జె డ్పీటీసీ సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉన్న ఈ ప్రాంతంలో స్థానికేతరులు పెత్తనం సాగించడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రొటోకాల్ పాటించని నాయకులు సభావేదిక ను ఎక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే వినేందుకు తామంతా సిద్ధంగా లేమని పేర్కొన్నారు. దీంతో వేదికపై ఉన్న మాజీ ఎమ్మెల్యే పరసారత్నం తన అనుచరులతో కలిసి దూరంగా వెళ్లి నిలబడిపోయారు. స్పందించిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే కిలివేటికి సర్దిచెప్పి తదనంతర కార్యక్రమాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు