ఇది ఎన్నికలగ్గసరి

8 Mar, 2014 02:07 IST|Sakshi

 వేసవి అనగానే ఎండలు గుర్తుకు వస్తాయి.    వాటితో పాటు ఈ సీజన్‌లో దొరికే మామిడి పండ్లు, తాటిముంజెలు, పుచ్చకాయల వంటివీ కళ్ల ముందు మెదులుతాయి. ముమ్మరంగా పెళ్లిళ్లు జరిగే ‘లగ్గసరి’ అనీ జ్ఞాపకమొస్తుంది. ఈ వేసవిని చూడబోతే ఎన్నిక‘లగ్గసరి’ అనాల్సి వచ్చేలా ఉంది. ఇప్పటికే మున్సిపల్, శాసనసభ, లోక్‌సభల ఎన్నికల షెడ్యూల్‌లు విడుదల కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో.. ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ స్థానిక సమరానికి శుక్రవారం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేసిన జిల్లా అధికారులు ఆ వివరాలను వెల్లడించారు.
 
 సాక్షి, కాకినాడ :
 ప్రభుత్వాదేశాల మేరకు ఈనెల ఆరులోగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాల్సి ఉన్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో జెడ్పీ సీఈఓ మజ్జి సూర్యభగవాన్ గురువారం గెజిట్ విడుదల చేశారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలో 58 మండలాలుండగా, రాజమండ్రి రూరల్  మండలంలోని మొత్తం గ్రామాలను  రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేయడంతో ఈ మండలం పూర్తిగా కనుమరుగైపోయింది. మిగిలిన 57 మండలాలకు సంబంధించి 57 జెడ్పీటీసీలు, 57 ఎంపీపీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు మూడు, ఎస్సీలకు 12, బీసీలకు 20, జనరల్‌కు 22 స్థానాలను కేటాయించారు. తొలిసారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి రావడంతో ఎస్టీ మహిళలకు రెండు, ఎస్సీ మహిళలకు ఆరు,  బీసీ మహిళలకు 10, జనరల్ మహిళలకు 11 రిజర్వు చేశారు. మొత్తం 57 స్థానాల్లో 29స్థానాలు మహిళలు రిజర్వు అయ్యాయి.
 
 రాష్ర్టం యూనిట్‌గా ఎంపీపీ రిజర్వేషన్లు..
 రాష్ట్రాన్ని యూనిట్‌గా చేసుకొని మండల పరిషత్‌లను రిజర్వు చేశారు. 57 ఎంపీపీ స్థానాలకు ఏజెన్సీ పరిధిలోని ఏడు స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించి, వాటిలో మూడింటిని మహిళలకు రిజర్వు చేశారు. మిగిలిన 50 ఎంపీపీ స్థానాల్లో ఒకటి ఎస్టీ జనరల్‌కు, ఎస్సీలకు 14 స్థానాలు రిజర్వు చేయగా, వాటిలో 7 మహిళలకు కేటాయించారు. బీసీలకు 18 స్థానాలు రిజర్వు చేయగా, వాటిలో తొమ్మిది మహిళలకు కేటాయించారు. జనరల్‌కు 17 ఎంపీపీ స్థానాలు కేటాయించగా, వాటిలో 9  జనరల్ మహిళలకు రిజర్వు చేశారు. అయితే ఏ మండలాన్ని  ఎవరికి కేటాయించాలన్న కసరత్తు ఇంకా పూర్తి కావలసి ఉంది.  
 
 ఎంపీటీసీల్లో సగం పైగా మహిళలకే..
 ఇక ఎంపీటీసీల విషయానికి వస్తే.. గతంలో 1154 ఎంపీటీసీ స్థానాలుండగా, రాజమండ్రి రూరల్ మండల పరిధిలో 10 , రాజానగరం మండల పరిధిలో 6, కోరుకొండ మండల పరిధిలో 3 గ్రామాలను రాజమండ్రి కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదించారు. దీంతో ఈ గ్రామాల పరిధిలో 62 ఎంపీటీసీ స్థానాలు కనుమరుగయ్యాయి. సామర్లకోట మున్సిపాల్టీలో రెండు, కాకినాడ కార్పొరేషన్‌లో ఐదు పంచాయతీలను విలీనం చేసేందుకు  ప్రతిపాదించారు. వీటి పరిధిలో 28 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈ ప్రతిపాదనపై కోర్టులో వాజ్యం ఉండగా, మూడు పంచాయతీలకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాల్సి ఉండడంతో వాటి పరిధిలో ఏడు పంచాయతీలను పరిగణనలోకి తీసుకోకుండా మిగిలిన గ్రామాల పరిధిలో ఉన్న 21 పంచాయతీలను కలుపుకొని మొత్తం 1063 ఎంపీటీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే వీటిలో 1042 స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్లు ఖరారైన మొత్తం స్థానాల్లో 574 మహిళలకు కేటాయించారు.
 
 సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్టీ జనరల్‌కు  21, ఎస్టీ మహిళలకు 30, ఎస్సీ జనరల్‌కు 93, ఎస్సీ మహిళలకు 120, బీసీ జనరల్‌కు 173, బీసీ మహిళలకు 199 కేటాయించారు. జనరల్‌కు 427 స్థానాలు కేటాయించగా వాటిలో 225 మహిళలకు కేటాయించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 37,27,510 మంది జనాభా ఉండగా, వారిలో 24,74, 280 మంది ఓటర్లున్నారు. వీరిలో 9,46,309 మంది బీసీ ఓటర్లు కాగా, 5,09, 908 ఎస్సీ ఓటర్లు, 1,06,061 మంది ఎస్టీ ఓటర్లున్నారు. వీరంతా ఈ స్థానిక సమరంలో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం  సన్నద్ధంగా ఉందని జెడ్పీ సీఈఓ  తెలిపారు.
 
 
 

మరిన్ని వార్తలు