రెండోరోజూ కొనసాగిన ఐటీ సోదాలు

7 Oct, 2018 03:25 IST|Sakshi

ప్రధానంగా రాజధాని రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలపై దృష్టి

8న హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతులకు నోటీసులు జారీ!

హార్డ్‌ డిస్కులు, డాక్యుమెంట్లను సీజ్‌ చేసి తీసుకెళ్లిన అధికారులు  

సాక్షి, అమరావతి/విశాఖ క్రైం: రాష్ట్రంలోని వివిధ వ్యాపార సంస్థలపై శుక్రవారం మొదలైన ఆదాయపన్ను శాఖ(ఐటీ) అధికారుల సోదాలు శనివారం రెండోరోజూ కొనసాగాయి. విజయవాడ, విశాఖపట్నంలలో సదరన్‌ డెవలపర్స్, శుభగృహ సంస్థల్లో శనివారమూ సోదాలు జరిపిన ఐటీ అధికారులు విలువైన పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను సీజ్‌ చేసి తమ వెంట తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, ఆయన బంధువులకు చెందిన సదరన్‌ డెవలపర్స్‌లో శనివారం సాయంత్రం దాకా కొనసాగాయి. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూలావాదేవీలపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు సమాచారం.

ఈ భూముల్ని ఎవరి పేరుమీద కొనుగోలు చేశారు.. దీనికైన నగదు ఎక్కడిదని ఐటీ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో 8, 9 తేదీల్లో హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పోతుల రామారావుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించడానికి ఐటీ అధికారులు నిరాకరించారు. సాధారణంగా ఆదాయపన్ను విభాగం జరిపే సోదాల్ని ఐటీశాఖ బహిర్గతం చేయదని, ఈ కేసుల్లోనూ తాము అదే పద్ధతి పాటిస్తామని ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సోదాల సందర్భంగా తీసుకున్న పత్రాలను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సంబంధిత వ్యక్తులనుంచి సేకరిస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, నంబూరు శంకర్‌రావుకు చెందిన శుభగృహ, ఎన్‌ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌లో శనివారం రాత్రి కూడా సోదాలు కొనసాగాయి. ఐటీ అధికారుల వద్ద ఉన్న సమాచారానికి, సోదాల్లో లభ్యమైన డాక్యుమెంట్లకు సరిపోలకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

దీంతో విజయవాడ మాచవరంలోని శుభగృహకు చెందినవారి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. మరోవైపు నెల్లూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావుకు చెందిన బీఎంఆర్‌ గ్రూపుల్లో గురువారం మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. సోదాలకు తొలుత బీఎంఆర్‌ గ్రూపు సహకరించకపోవడంతో ఐటీశాఖ తనదైన శైలిలో ప్రశ్నించడంతో దారికొచ్చారు. ఇక్కడా విలువైన డాక్యుమెంట్లను సీజ్‌ చేసి తీసుకెళ్లడంతోపాటు తదుపరి విచారణకోసం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

విశాఖలో..
విశాఖ నగరంలోని పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో ఐటీ అధికారులు శనివారమూ సోదాలు కొనసాగించారు. సీతమ్మధారలోని ఎన్‌ఎస్‌ఆర్‌ఎన్‌ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, శుభగృహ సంస్థల్లో పోలీసు భద్రత మధ్య సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతంలో జరిపిన భూముల క్రయవిక్రయాలు, ఐటీ చెల్లింపులపై ఆరా తీసినట్టు సమాచారం.


బీద మస్తాన్‌రావు సంస్థల్లో మూడోరోజూ ఐటీ సోదాలు
భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీల గుర్తింపు..
కావలి: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సంస్థల్లో మూడోరోజైన శనివారమూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా భారీగా నగదు, నకిలీ డాక్యుమెంట్లు, హవాలా లావాదేవీలను ఐటీ అధికారుల బృందం గుర్తించినట్టు తెలుస్తోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని విమానాశ్రయ భూముల వద్ద ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన విదేశాలకు రొయ్యలు ఎగుమతి చేసే ప్రాసెసింగ్‌ ప్లాంట్, రొయ్యల మేత ఫ్యాక్టరీ ప్రాంగణంలో భారీగా నగదు బయటపడినట్టు తెలిసింది. అలాగే తనిఖీల సందర్భంగా చెన్నైలోని ఒక రహస్య భవనంలో భారీగా నగదునూ ఐటీ అధికారులు కనుగొన్నట్టు సమాచారం.

అక్కడే కావలి నియోజకవర్గంలోని అల్లూరు మండలం ఇస్కపల్లి ప్రాంతంలో ఉన్న బీద మస్తాన్‌రావుకు చెందిన రొయ్యల గుంతలు, రొయ్య పిల్లల హేచరీలకు సంబంధించిన భూముల యాజమాన్య హక్కుల నకిలీ డాక్యుమెంట్లను కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే బీద మస్తాన్‌రావుకు చెందిన సంస్థలు, కార్యాలయాలున్న దామవరం, నెల్లూరు, చెన్నైలలో జరిపిన తనిఖీల్లో హవాలా రూపంలో విదేశాల నుంచి నగదు లావాదేవీలు జరిగిన విషయం బహిర్గతమైంది. మస్తాన్‌రావుకు అమెరికాలో రొయ్యల విక్రయ కేంద్రం ఉంది. అమెరికాతోపాటు పలు దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తారు.

ఈ విదేశీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి, సురక్షితంగా తమ వద్దకు నగదును చేర్చుకోవడానికి హవాలా మార్గాన్ని అనుసరించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బ్యాంకులద్వారా జరిగిన లావాదేవీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా కేవలం పుస్తకాలలో రాతలద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వేర్వేరుగా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం. కాగా, బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలతోపాటు వారి కుటుంబసభ్యుల పేర్లమీదున్న సంస్థలద్వారా టీడీపీ నాయకులకిచ్చిన నగదు వివరాల్నీ ఐటీ అధికారులు సేకరించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కోటరీలో ముఖ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు భీతిల్లిపోతున్నారు. మరోవైపు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బీద రవిచంద్ర భాగస్వామ్యం ఉన్న సంస్థలతోపాటు ప్రైవేటుగా నిర్వహించిన లావాదేవీలపైనా ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు