వాళ్లవి విభజన రాజకీయాలు

7 Oct, 2018 03:26 IST|Sakshi
అజ్మీర్‌ ర్యాలీలో మోదీ, వసుంధరా రాజే అభివాదం

‘రాజస్తాన్‌ గౌరవ యాత్ర’లో కాంగ్రెస్‌పై మోదీ మండిపాటు

రైతులకు ఉచిత విద్యుత్తు

సీఎం వసుంధర హామీ

అజ్మీర్‌: అధికారం కోసం ప్రజలను విడదీస్తూ కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతూ, అనుమానాలు పెంచుతూ ప్రజలను భయ పెడుతోందన్నారు. ఆ పార్టీకి అధికారం దక్కనివ్వరాదని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజస్తాన్‌ సీఎం వసుంధరా రాజే చేపట్టిన ‘రాజస్తాన్‌ గౌరవ యాత్ర’ ముగింపు సందర్భంగా శనివారం అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘ఆ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కాలేదు. అధికారంలో ఉండగా ప్రభుత్వ యంత్రాంగంలోనూ చిచ్చుపెట్టింది. పర్యవసానంగా పరిపాలన దెబ్బతింది.

ఓటు బ్యాంకు దృష్టితోనే నిధులు కేటాయించడంతో సమగ్ర అభివృద్ధి జరగలేదు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ ఈ దుస్సంప్రదాయాన్ని కొనసాగించింది. అతికష్టంమీద, 60 ఏళ్ల తర్వాత ప్రస్తుతం వ్యవస్థ గాడినపడింది. వారికి మళ్లీ అవకాశం ఇవ్వకండి. కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ ఒక కుటుంబం. ఆ కుటుంబానికి భజన చేయడం ద్వారానే వారు రాజకీయాలు సాగిస్తున్నారు’ అని పేర్కొన్నా రు. ‘రెండేళ్ల క్రితం సైన్యం చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘సర్జికల్‌ స్ట్రైక్‌’ను సైతం కాంగ్రెస్‌ ప్రశ్నించింది. సైనికులను అగౌరవపరిచింది అని అన్నారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంశాల వారీగా ఎందుకు పోరాడటం లేదు? అబద్ధాలు చెప్తూ ప్రజల్లో అనుమానాలను పెంచడమే వారికి ఇష్టం’ అని అన్నారు.

రైతులకు ఉచిత కరెంటు
రైతులందరికీ ఉచిత విద్యుత్‌ అందజేస్తామని రాజస్తాన్‌ సీఎం వసుంధర ప్రకటించారు. ఎన్నికల కమిషన్‌ రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించటానికి కొద్దిసేపటికి ముందు జరిగిన ‘రాజస్తాన్‌ గౌరవ యాత్ర’ ర్యాలీలో ఆమె ఈ ప్రకటన చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన సత్వరమే నియమావళి అమల్లోకి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని జనరల్‌ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న రైతులందరికీ పరిమితికి లోబడి ఉచిత కరెంటు అందజేసే పథకాన్ని 5న ప్రారంభించామన్నారు. ఈ పథకం అన్నదాతల ఆదాయం పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి గృహానికి విద్యుత్‌ సౌకర్యం కల్పించిందని తెలిపారు. రూ.40 వేల కోట్లతో విద్యుత్‌ వ్యవస్థను మెరుగుపరిచామన్నారు. విద్యుత్‌ సౌకర్యమే లేని గ్రామాల్లో సైతం ప్రస్తుతం 20 నుంచి 22 గంటలపాటు నిరాటంకంగా కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు.  
 

మరిన్ని వార్తలు