టీడీపీ ఆగడాలపై జగన్‌కు ఫిర్యాదు

2 Aug, 2014 02:04 IST|Sakshi
టీడీపీ ఆగడాలపై జగన్‌కు ఫిర్యాదు

గుంటూరు : కృష్ణా జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలు పెరిగాయని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. గుంటూరులోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో బసచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం ఉదయం ఆమె కలసి అధికార పార్టీ నాయకుల ఆగడాలపై ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రధాన ప్రతిపక్షంపై అధికార పార్టీ నేతలు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు. గడచిన రెండు నెలల్లో టీడీపీ నాయకులు గ్రామాల్లో సామాన్య కార్యకర్తలను సైతం వదలకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు చెప్పారు.

జిల్లా పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ విషయాలన్నింటిని గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డిని కలసిన వారిలో పార్టీ జెడ్పీ ప్లోర్‌లీడర్ తాతినేని పద్మావతి, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పెదపారుపుడి జెడ్పీటీసీ సభ్యురాలు మూల్పూరి హరీష తదితరులు ఉన్నారు.
 
 

మరిన్ని వార్తలు