పశ్చిమలో గ్లాస్‌కు పగుళ్లు..

24 May, 2019 15:36 IST|Sakshi

సాక్షి, ఏలూరు (మెట్రో): జిల్లా నుంచి గెలుస్తాను అనే ధీమాతో ఎన్నికల బరిలో దిగిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు పరాభవం ఎదురైంది.  భీమవరం అసెంబ్లీ పరిధిలో పోటీ చేసిన జనసేనాని ఓటమి చవిచూశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాలకు 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన జనసేన ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థులు కొన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చినా అది వృథా అయింది. గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జనసేన తరఫున అభ్యర్థులను నిలపలేదు.

జిల్లావ్యాప్తంగా జనసేనకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. చింతలపూడిలో 11,739, దెందులూరులో 6,116, ఏలూరులో 16,681, నిడదవోలులో 22647, ఆచంటలో 13,856, పోలవరంలో 13,378, ఉంగుటూరులో 10,721, పాలకొల్లులో 32,984, నరసాపురంలో 48,701, భీమవరంలో 62285, ఉండిలో జనసేన మిత్రపక్షమైన సీపీఎంకు 24737, తణుకులో 31,502, తాడేపల్లిగూడెంలో 35,325 ఓట్లు ఆ పార్టీ సాధించింది. అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో 76,481, నరసాపురం పార్లమెంటు పరిధిలో 2,45,867 ఓట్లను జనసేన సాధించింది.     

>
మరిన్ని వార్తలు