ప్రజాసమస్యలు గాలికొదిలిన మంత్రి ఉమా

12 Jan, 2016 01:42 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: మైలవరం నియోజకవర్గం ప్రజాసమస్యలను జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు గాలికొదిలేసి తిరుగుతున్నాడని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం సమన్వయ కర్త జోగి రమేష్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో  జరిగిన గ్రామసభలో అధికార పక్ష ప్రజాప్రతినిధులు పాల్గొనక పోవడాన్ని బట్టి మంత్రి నిర్వాకం బయట పడిందన్నారు. ప్రజాప్రతినిధుల గైర్హాజరుతో జన్మభూమి సభ అభాసుపాలైందన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సర్పంచి, జెడ్పీటీసీ, ఎంపీపీ జన్మభూమి సభకు హాజరుకాకపోవటం వెనుక మతలబు ఏమిటని మంత్రిని ప్రశ్నించారు.  హైవే బాధితులు, నివాసాలు కోల్పోయిన వారు, స్థానిక ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, మంత్రి ఉమా ముఖం చాటేశాడని ఎద్దేవాచేశారు. బీసీ ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఇవ్వకుండా మంత్రి ఉమా తన చెప్పు కింద అణగదొక్కుతున్నాడని ఆరోపించారు.

ప్రజాప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న జన్మభూమి సభను టీడీపీ సభగా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు హాజరు కాకపోయినా ప్రొటోకాల్ లేని వ్యక్తులు జన్మభూమి వేదికపై సబ్‌కలెక్టర్ సమక్షంలో కూర్చోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన సమస్యలు వివరిస్తున్న వైఎస్సార్ సీపీ, సీపీఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో మంత్రి ఉమాతో పాటు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధి చూపాలని హితవు పలికారు.
 

మరిన్ని వార్తలు