జాయింట్ పవర్‌కు చెక్

26 Aug, 2013 04:49 IST|Sakshi
 సాక్షి, కరీంనగర్ :సర్పంచుల నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనతో జాయింట్ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిం ది. కార్యదర్శులతో అధికారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై కొత్తగా ఎన్నికయిన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనలను ప్రభుత్వ పెద్దల దృష్టికి వివిధ రూపాల్లో తీసుకెళ్లిన జిల్లా సర్పంచులు ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. రెండేళ్ల క్రితమే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దిగిపోగా ఇంతకాలం ప్రత్యేకాధికారులే పాలన సాగించారు. 
 
 ఎట్టకేలకు ప్రభుత్వం పంచాయతీలకు గత నెల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 2న కొత్త సర్పంచులు కొలువుదీరారు. భాద్యతలు తీసుకున్నా అధికారాలు లేక అయోమయస్థితిలో ఉన్న సర్పంచులు అభివృద్ధి పనులు చేసేందుకు చెక్ పవర్ ఇవ్వాలని విన్నపాలు చేయగా ఈనెల 19న 385 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శితో కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించింది. పంచాయతీ జనరల్ ఫండ్ నిధులతో కనీస వసతులు కల్పించేందుకు కూడా సర్పంచులకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఉత్తర్వులపై సర్పంచులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల ద్వారా ఎన్నికలయిన ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అవమానించిందన్న ఆగ్రహం వ్యక్తమయ్యింది. నిధులు దారి మళ్లకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు చేస్తున్న వాదనపై వారు విరుచుకుపడుతున్నారు.
 
 గతంలో పలువురు సర్పంచులు భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు రుజువయ్యింది. కొంతమంది సర్పంచుల నుంచి రికవరీ కూడా చేశారు. ఇంకా రూ.మూడు కోట్ల వరకు రికవరీ కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగిన దుర్వినియోగాన్ని సాకుగా చూపి ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం సరైందికాదని కొత్త సర్పంచులు అంటున్నారు. జిల్లాలో 1206 పంచాయతీల్లో పాలకవర్గాలు ఉండగా 550 మంది కార్యదర్శులే ఉన్నారు. ఒక కార్యదర్శికి రెండుమూడు పంచాయతీల బాధ్యతలు కేటాయించారు. దీని వల్ల నిధుల వినియోగంలో ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది.
 
 గతంలో సర్పంచులతోపాటు ఒక వార్డు సభ్యుడికి చెక్ పవర్ ఉండేది. చెక్ వవర్  సభ్యుడిని వార్డుసభ్యులు ఎన్నుకునేవారు. ఈసారి ఈ విధానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిధుల వినియోగంలో తమకు పూర్తి అధికారాన్ని ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. నిధులు దారి మళ్లకుండా ప్రజావసరాలకే ఖర్చయ్యేలా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం సర్పంచులకు పూర్తిస్థాయిలో చెక్ పవర్ కల్పించేందుకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. 
 
మరిన్ని వార్తలు