జర్నలిస్ట్ నరేందర్ కన్నుమూత

3 Apr, 2014 02:38 IST|Sakshi
జర్నలిస్ట్ నరేందర్ కన్నుమూత

హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు నరేందర్ రేవల్లి (50) అనారోగ్యంతో బుధవారం కన్ను మూశారు.  కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయన ఇక్కడి ‘కిమ్స్’ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  నరేందర్‌కు భార్య ఉషా రమణి, ముగ్గు రు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ 1987లో ఆంధ్రజ్యోతిలో పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆంధ్రజ్యో తి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికల్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా పని చేశారు. అనంతరం ఎక్స్‌ప్రెస్ మీడియా సర్వీస్, జైన్ టీవీలో పొలిటికల్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ సీకే నాయుడు, సయ్యద్ ముస్తాక్ అలీ, హెచ్‌సీఏ వజ్రోత్సవాల సందర్భంగా నరేందర్ రూపొందిన డాక్యుమెంటరీలు ఆయనకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. సాక్షి పత్రిక సంపాదకులు వర్ధెల్లి మురళి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, నమస్తే తెలంగాణ సంపాదకులు అల్లం నారాయణ తదితరులు నరేందర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.  నరేందర్ మృతి పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం ప్రకటించాయి.
 
 

మరిన్ని వార్తలు