వర్సిటీ.. అక్రమాల పుట్ట

26 Feb, 2018 13:22 IST|Sakshi
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిపాలనా భవనం

సీనియర్లను కాదని జూనియర్లకు జీతాల పెంపు

ఇష్టారాజ్యంగా నియామకాలు

ప్రైవేటు కళాశాలల కమీషన్ల కోసం ఆరాటం

అవినీతికి సహకరించని వారికి వేధింపులే..

విక్రమ సింహపురి యూనివర్సిటీ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పాలన గాడి తప్పింది. కింది స్థాయి ఉద్యోగాల నియామకాల నుంచి భవనాల నిర్మాణాలు, అద్దెభవనాలు, యూనివర్సిటీకి చెల్లించాల్సిన అఫిలియేషన్‌ ఫీజు రాబట్టడం, సిబ్బందికి జీతాలు పెంచడంలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల్లో ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా వ్యవహరించడం తదితర విషయాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు.

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట, అర్బన్‌): గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ ఉన్నత విద్యను అందించాలనే ఉన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాకో యూనివర్సిటీని ప్రకటించారు. అందులో భాగంగానే పదేళ్ల క్రితం నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీని(వీఎస్‌యూ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్య అందించడం, పరిశోధనలకు ఆలంబనగా నిలవడం యూనివర్సిటీ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. అయితే వీఎస్‌యూలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాలనాధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి.

ఆ ఇద్దరికే జీతాలు పెంపు
యూనివర్సిటీలో ఆరు, ఏడు  సంవత్సరాల నుంచి డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.9,700   ఇస్తున్నారు. వీరిని కాదని మూడున్నరేళ్ల క్రితం చేరిన ఇద్దరికి జీతం రూ.11,400 జీతం చొప్పున  పెంచుతూ అధికారులు ఫైలును శనివారం సిద్ధం చేశారు. మిగతా వారి నోట్లో మట్టికొట్టారు. జీతాలు పెంచేందుకు కారణం పరిశీలిస్తే..  ఒకరు జిల్లా మంత్రికి సంబంధించిన వారు కాగా మరొకరు వర్సిటీ  అడ్మినిస్ట్రేషన్‌ భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కీలక అధికారి బంధువు. జీతాలు జూనియర్లకు పెంచడానికి, సీనియర్లకు పెంచకపోవడానికి  కారణాలు గురించి రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ విద్యార్హత, సీనియర్‌ అనే విషయం కీలకం కాదన్నారు. వారు గతంలో ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు, ఆ పోస్టుకు నిబంధనల ప్రకారం ఎంత జీతం ఇవ్వాలి అనే అంశంపై ఆధారపడి ఇక్కడ జీతం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ మాటే వాస్తవమైతే గతంలో కావలి పీజీ సెంటర్‌లో ల్యాబ్‌అసిస్టెంట్‌గా దరఖాస్తు చేసుకుని కొంతకాలం కావలిలో పనిచేసిన వ్యక్తిని వర్సిటీ ఏడీ కార్యాలయానికి బదిలీ చేయించారు. అంతేకాకుండా పరీక్షలకు సంబంధించి కోడింగ్, డీకోడింగ్‌ తదితర కీలక బాధ్యతలు అప్పజెప్పారు. రిజిస్ట్రార్‌ చెప్పింది వాస్తవమైతే ఈ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న ల్యాబ్‌ అసిస్టెంట్‌ను కాదని మరో బాధ్యతలు ఎలా అప్పజెప్పారో అర్థం కావడం లేదు.

ఖాళీభవనానికి రూ.వేలల్లో  అద్దె చెల్లింపు
వర్సిటీ పరిపాలనా కార్యాలయాన్ని నెల్లూరు నుంచి కాకుటూరులోని సొంత భవనంలోకి ఏడాదిన్నర క్రితమే తరలించారు. అయితే పీజీ సెట్‌ సెంటర్‌ను మాత్రం తరలించలేదు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ పక్కన పీజీ సెట్‌ భవనాన్ని ఖాళీగా ఉంచారు. ప్రతి నెలా రూ.20వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇందులో ఒక అధికారికి భారీగా కమీషన్‌ అందుతుందని ఆరోపణలున్నాయి.  పైగా ఈ ఏడాది పీజీ సెట్‌కు సంబంధించి ఎంబీఏలో కొన్ని విభాగాలకు అడ్మిషన్లు ఇవ్వకుండా ఆపేశారు. ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే కమీషన్ల కోసమే ఈ పని చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా అక్రమాలు
వీసీ పదవీ కాలం మరో నెలలో ముగియనుంది. ఆరు నెలల ముందు నుంచే  ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకూడదు. అయితే ఇక్కడ వీసీ ఆధ్వర్యంలో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చాయి. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన అప్పటి రిజిస్ట్రార్‌ శివశంకర్‌ను ఈ పోస్టుల దరఖాస్తులకు స్క్రూటినీ అధికారిగా నియమించడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఇందులో గత రిజిస్ట్రార్‌పై వీసీకి అంత ప్రేమ ఎందుకని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒకే కాలనీలో .. ఒకే వర్గానికి చెందిన బం««ధుమిత్రులకు కిందిస్థాయిలో 32 పోస్టులను కట్టబెట్టారు. మిగతా వర్గాల వారికి ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
ఎంతో మంది సీనియర్లు వర్సిటీలో పని చేస్తుండగా రెండు నెలల క్రితం కేవలం నలుగురు నమ్మిన బంట్లుగా ఉన్న ఉద్యోగుల పేర్లు మాత్రమే టైం స్కేల్‌(రెగ్యులర్‌) కింద అనుమతివ్వాలని బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మిగతా వారిని కాదని నలుగురికే టైంస్కేల్‌ వర్తింపజేయడానికి బోర్డు అంగీకరించలేదు. దీంతో ఒక ఉద్యోగి తనకు ఎలాగూ టైం స్కేల్‌ ఇప్పించలేకపోయారని తన భార్యకు పోస్టు  ఇవ్వాలని కోరడు. కాంట్రాక్ట్‌ బేస్‌లో వీసీ ఆమెకు ఈ నెల ఒకటో తేదీన  ఉద్యోగం ఇచ్చారని తెలిసింది. అధికారం ఉంటే ఒక పద్ధతి, రోస్టర్‌ ఏమీ లేకుండా ఉద్యోగం కల్పించడం తగునా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

సహకరించకపోతే ఇబ్బందులే..
ఐదు రోజుల క్రితం కావలి పీజీ సెంటర్‌లో ఇంటర్నల్‌  పరీక్ష రాసేందుకు వర్సిటీ ఉన్నతాధికారి బంధువుగా ప్రచారం జరుగుతున్న  ఒక విద్యార్థిని వచ్చారు.  హాజరు లేని కారణంగా పరీక్ష రాయించేందుకు అక్కడి  అధ్యాపకురాలు అంగీకరించలేదు. ఇలా అంగీకరించనందుకు ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు మొదలయ్యాయి.
యూనివర్సీటికీ ప్రైవేటు  కళాశాలల బకాయి
యూనివర్సిటీ ఆర్థిక కష్టాల్లో ఉంది. అయితే వర్సిటీకీ అఫిలియేషన్‌ ఫీజు కింద అన్ని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కలిసి సుమారు రూ.కోటి వరకు ఫీజు చెల్లించాలి. విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలల యజమానులు వర్సిటీకి బకాయిపడిన ఫీజు మాత్రం చెల్లించడం లేదు. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు ఆగిపోవడానికి కారణం ప్రైవేటు కళాశాలలు వర్సిటీ ఉన్నతాధికారులకు ఇస్తున్న తాయిలాలేనని తెలుస్తోంది. ఇలా తవ్వే కొద్దీ అక్రమాలెన్నో వెలుగు చూస్తున్నాయి.

అంతా పారదర్శకంగానే
నేను బాధ్యతలు చేపట్టి వారం రోజులే అయింది. అంతా పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తా. సీనియర్లను కాదని ఇద్దరు జూనియర్లకు జీతాలు పెంచే విషయంలో తప్పులు జరగలేదు. వారు గతంలో దరఖాస్తు చేసుకున్న పోస్టునుబట్టి జీతాలు పెరగబోతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలలు బకాయిలున్న మాట వాస్తవమే. వారందరి దగ్గర అఫిలియేషన్‌  ఫీజులు వసూలు చేస్తాం. అప్పటి వరకు వారికి సర్వీసులు నిలిపేస్తాం. ప్రస్తుతం వర్సిటీలో ఉన్న రూములు సరిపోవడం లేదు. అందుకే  పీజీ సెట్‌ కార్యాలయం ప్రైవేటు భవనంలోనే ఉంది. అవినీతి అనేది ఉత్తిదే. –దుర్గాప్రసాద్, నూతన రిజిస్ట్రార్, వీఎస్‌యూ

మరిన్ని వార్తలు