అభిప్రాయాలు చెప్పనివారికి మాట్లాడే అర్హత ఉండదు

1 Apr, 2018 03:46 IST|Sakshi
ఏబీకేను సత్కరిస్తున్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, కె.రామచంద్రమూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాడభూషి శ్రీధర్, వీవీ రమణమూర్తి

     సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌     

     న్యాయవ్యవస్థకంటే పద్మావతి సినిమా ఎక్కువా?

     ప్రభుత్వాలను విమర్శిస్తే నక్సలైట్లు అంటున్నారు

సాక్షి, విశాఖపట్నం: సమకాలీన వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై అభిప్రాయాలు చెప్పలేని వారికి సమాజం గురించి మాట్లాడే అర్హత ఉండదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ వ్యాఖ్యానించారు. ‘ఆరేడు నెలలుగా భారత న్యాయవ్యవస్థలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కానీ వాటిపై కచ్చితమైన అభిప్రాయాలు చెప్పిన వారు చాలా తక్కువ. నన్ను సమర్థించమని చెప్పను. నేను లేవనెత్తిన లోపాలు కరెక్టా? కాదా? అని చెప్పడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్ధం కావడం లేదు.. ఏమీ మాట్లాడక పోవడం సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాద’న్నారు. పత్రికా రంగంలో అక్షరబ్రహ్మగా పేరొందిన సీనియర్‌ సంపాదకులు ఏబీకే ప్రసాద్‌ జర్నలిజంలోకి అడుగుపెట్టి 62 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైటర్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం విశాఖలో ఆయనను ఘనంగా సన్మానించారు.

అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో జస్టిస్‌ చలమేశ్వర్‌ వివిధ అంశాలపై ప్రసంగించారు. ‘పద్మావతి సినిమా రిలీజ్‌ అవ్వాలా? వద్దా అని ముఖ్యమంత్రులు, కేబినెట్‌ మంత్రులు, అన్ని వర్గాల ప్రజలు మాట్లాడారు. కానీ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం అభిప్రాయాలు చెప్పేందుకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం దురదృష్టకరమని చలమేశ్వర్‌ అన్నారు. జడ్జి అయిన కొత్తలో తొలి సన్మానం ఏబీకే ప్రసాద్‌ చేతుల మీదుగానే జరిగింది. పేదవాడ్ని దృష్టిలో పెట్టుకొని తీర్పులివ్వాలని ఆనాడు ఆయన చెప్పిన మాటలు నేటికీ గుర్తున్నాయి.

అదే బాటలో ప్రస్థానం కొనసాగిస్తున్నానన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఏ ఒక్క పార్టీ కూడా కేవలం 3034 శాతం ఓట్లతోనే మెజార్టీ సీట్లు సాధించి గద్దెనెక్కాయి. ఈ దేశంలో మేం ఏం చెబితే అదే వేదం, మేం ఏ కావాలంటే అదే జరుగుతుంది అన్న ధోరణిలో పాలక పక్షాలు పాలన సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే వారు అరాచకులు, దుర్మార్గులు, ప్రజా కంఠకులు. కొత్తగా అర్బన్‌ నక్సలైట్లు అని ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న భారతావనిలో దాదాపు 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏ రాష్ట్ర బడ్జెట్‌లో చూసినా న్యాయ వ్యవస్థకు 2 శాతానికి మించి కేటాయింపులుండవని చెప్పారు. పత్రికా రంగానికే తలమానికమైన ఏబీకే ప్రసాద్‌ను సత్కరించడం అభినందనీయమన్నారు. 

ప్రశ్నించేతత్వం లేని సమాజానికి మనుగడ లేదు 
 ప్రశ్నించేతత్వం కోల్పోయిన సమాజానికి మనుగడ ఉండదని సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని ఇష్టమొచ్చిన రీతిలో ఖర్చు చేస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. ఇటీవలే తెలంగాణా ప్రభుత్వం దుర్వినియోగం చేసిన తీరును కాగ్‌ ఎండగట్టింది.. నేడో రేపో ఏపీ ప్రభుత్వ తీరును కూడా కాగ్‌ బట్టబయలు చేయనుందన్నారు. ముగ్గురు సహ న్యాయమూర్తులతో కలిసి చరిత్రలో తొలిసారిగా సుప్రీం చీఫ్‌ జస్టిస్, న్యాయ వ్యవస్థ లోపాలపై ప్రశ్నించడం ద్వారా జస్టిస్‌ చలమేశ్వర్‌ నిజంగా చరిత్ర సృష్టించారన్నారు. పత్రికా రంగంలో నిబద్ధత, నిజాయతీకి నిర్వచనం ఏబీకే అని, 62 ఏళ్లుగా ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారన్నారు. ఆయన వారసత్వాన్ని, విలువలన్ని, పాత్రికేయాన్ని కొనసాగించే అదృష్టం నాకు లభించింది. ఏబీకే గారు ఎప్పుడూ ప్రభుత్వాన్ని పొగుడుతూనో, ముఖ్యమంత్రికి భజన చేస్తూనో ఒక్క వాక్యం రాయలేదని చెప్పారు.  

పౌర సమాజం పోరుబాటపట్టాలి
తనకు జరిగిన సన్మానంపై ఏబీకే ప్రసాద్‌ స్పందిస్తూ ఉదయం సహా ఐదారు ప్రముఖ పత్రికలకు సంపాదకత్వం వహించే అవకాశం తనకు లభించిందని, 23 జిల్లాల్లో ఆరేడువేల మంది జర్నలిస్టులను తయారు చేయగలిగానన్నారు. 62 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు ఈ రంగంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నేడు పత్రికా వ్యవస్థ గొంతు నులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పత్రికలతో పాటు పౌర సమాజం కూడా క్రియాశీలంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వాలపై పౌరసమాజం పోరాటం చేసే దిశగా పత్రికలు వారిలో చైతన్యం నింపాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌  ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు