కేఈ శ్యాంబాబు నిందితుడే: డోన్‌ కోర్టు

17 Feb, 2018 02:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబుతోపాటు టీడీపీకి చెందిన ఆస్పరి మండల జెడ్పీటీసీ సభ్యురాలు కప్పట్రాళ్ల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్ది ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను డోన్‌ కోర్టు నిందితులుగా పేర్కొంది. ముగ్గురిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.

ఈ మేరకు డోన్‌ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆంజనేయులు శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘‘నారాయణరెడ్డి హత్య ఘటనలో కేఈ శ్యాంబాబు, బొజ్జమ్మ, నాగతులసీ ప్రసాద్‌ల పాత్రపై ఆధారాలను బట్టి కచ్చితంగా కోర్టు విచారణ జరపాల్సిందే. అందువల్లే ఐపీసీ సెక్షన్‌ 147, 148, 149 (గుంపుగా మారణాయుధాలతో తిరగడం), 302(హత్య), 109(తప్పు చేసేందుకు సహకరించడం), మారణాయుధాల చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్‌ 120(బీ)(కుట్ర చేయడం) కింద వీరిపై కేసులు నమోదు చేయాలి. ఇందుకు అనుగుణంగా ఈ ముగ్గురిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేస్తున్నాం. తదుపరి విచారణను మార్చి 1వ తేదీన చేపడతాం’’అని న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులో స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు