‘చెప్పు’ తెగింది

23 May, 2014 10:13 IST|Sakshi
‘చెప్పు’ తెగింది

 * జై సమైక్యాంధ్ర అన్నా పడని ఓట్లు
 * సార్వత్రిక ఎన్నికల్లో పరువు దక్కని వైనం
 * అత్తెసరు ఓట్లకే జేఎస్పీ అభ్యర్థులు పరిమితం
* సీపీఎం మిత్రపక్షంగా పోటీచేసినా ఫలితంలేదు
 
మచిలీపట్నం : జై సమైక్యాంధ్ర అని నినదించిన ఆ పార్టీకి పరువు దక్కలేదు. అత్తెసరు ఓట్లతో ఆ పార్టీ అభ్యర్థులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ గుర్తుగా పెట్టుకున్న చెప్పులపై ఓట్లు పడక జేఎస్పీ అభ్యర్థులు అసెంబ్లీ దారిలో నడవలేకపోయారు. సమైక్యవాదినంటూ చివరి నిముషం వరకు సీఎం పదవిని ఎంజాయ్ చేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని జనం నమ్మలేదనే విషయం రుజువయింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆ అభ్యర్థులకు పడిన ఓట్లు వారి పరువు తీసేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

 జిల్లాలో 33 లక్షలకు పైగా ఓట్లు ఉన్నప్పటికీ విజయవాడ, మచిలీపట్నం ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు కనీసం 13 వేల ఓట్లు దాటలేదు. సీపీఎం అభ్యర్థులు పోటీ చేసిన చోట మినహా జిల్లాలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎస్సీ అభ్యర్థులు మొత్తానికి కేవలం పదివేల ఓట్లు లోపు మాత్రమే రావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు నామమాత్రపు ఓట్లుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో వారికంటే స్వతంత్ర అభ్యర్థులకే మెరుగైన ఓట్లు వచ్చాయి.

 విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి చిన్నం ఐశ్యర్యకు 5,292 ఓట్లు,  మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కమ్మిల శ్రీనివాస్‌కు 7,680 ఓట్లు వచ్చాయి. కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన జై సమైక్యాంధ్ర పార్టీ జిల్లా అధ్యక్షుడు బొర్రా చలమయ్య 1,151 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బి.సౌజన్య (గన్నవరం)కు 813, కోయిలపు రాము (గుడివాడ) 624, వాకా వాసుదేవరావు (పెడన)1,401, లంక కరుణాకర్‌దాసు (మైలవరం) 662, తంగిరాల మణిభూషణ్ (నందిగామ) 268, తాటిబందెల వెంకట్రావు (జగ్గయ్యపేట) 1,175, పాలడుగు డేవిడ్‌రాజు (పామర్రు) 886, గనిపిశెట్టి గోపాల్ (మచిలీపట్నం) 1,140 చొప్పున ఓట్లు సాధించారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ చెప్పు తెగిపోయిందని ఓటర్లు చాటి చెప్పారు.  
 

>
మరిన్ని వార్తలు