CBN Political Talks With Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌తో చంద్రబాబు భేటీ

23 Dec, 2023 16:53 IST|Sakshi

గతంలో ప్రశాంత్‌ కిషోర్‌ను బీహారీ దొంగ అన్న చంద్రబాబు

ఇప్పుడు బతిమాలి మరీ తెచ్చుకున్న వైనం

ఏదోటి చేయాలని.. గట్టెక్కించాలని వేడుకోలు

ఖర్మ ఏంచేస్తాం.. కాలం తిరగబడి వెంటాడితే ఎలాంటివారైనా నేలచూపులు చూడాల్సిందే. ప్రధానులను తయారు చేశాను.. నేను విజనరీని.. చాణక్యుడిని అంటూ బోలెడు ఎచ్చులకు పోయిన చంద్రబాబు తాను ఎవరినైతే దొంగ అని ఆరోపించారో మళ్ళీ ఆయనతోనే చెట్టాపట్టాల్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

టైం వస్తే అంతే.. గతంలో 2019లో ఎన్నికలకు ముందు ‘బీహారీ దొంగ’ అని చంద్రబాబు నిందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరం ఇప్పుడు పడింది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఈ ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పని చేశారు. ఆ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈయన మీద ఇష్టానుసారం మాట్లాడారు. బీహారీ దొంగ రాష్ట్రాన్ని పాడుచేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారు.. నా ఓటు కూడా తీసేస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. అక్కసు వెళ్లగక్కారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఎవర్ని తిట్టామో వాళ్ళ కాళ్లే పట్టుకోవాల్సిన ఖర్మ వస్తుంది.

తెలుగుదేశం పార్టీ 2019లో ఘోర ఓటమి తరువాత పూర్తిగా కునారిల్లింది. క్యాడర్ చల్లబడిపోయింది. లోకేష్ సైతం ఎంత హైప్ చేస్తున్నా లేవడం లేదు. దీంతో అదే ప్రశాంత్ కిషోర్ టీమ్లో పని చేస్తున్న రాబిన్ శర్మను వ్యూహకర్తగా పెట్టుకుని ఇదేమి ఖర్మ.. బాదుడే బాదుడు. లోకేష్ ఎర్ర డైరీ వంటి పలు వ్యూహాలు అమలు చేసారు.. అయినా పని జరగలేదు... ఇక ఇటు సీఎం జగన్‌ తన పథకాలు.. వలంటీర్లు.. గృహసారధుల టీమ్‌తో ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.

దీంతో భయానికి గురైన చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ ఉంటే బాగుండు అని భావించి ఆయన్ను కలిసే ఏర్పాటు చేయమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్నిరోజులు ఢిల్లీలో మకాం వేసిన లోకేష్ మొత్తానికి పీకేను పట్టుకున్నా చివరి రోజుల్లో వచ్చి తానేం చేయలేనని చేతులెత్తేశారు. అయినా ఆశ చావని చంద్రబాబు శతథా ప్రయత్నించి ఆయన్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరం తీసుకొచ్చారు.

కాసేపటి క్రితం లోకేష్.. చంద్రబాబు.. ప్రశాంత్ కిశోర్.. రాబిన్ శర్మ తదితరులు సమావేశమై.. రానున్న ఎన్నికల్లో గట్టెక్కే మార్గం గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడొచ్చి తానూ ఏమీ చేయలేనని ఇప్పటికే చెప్పినా వీళ్ళు వదలకపోవడంతో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఎవరెవరు కూటమి కట్టినా తన పొత్తుమాత్రం జనంతో అని ఇప్పటికే తేల్చి చెప్పిన సీఎం జగన్ ప్రజల మద్దతును పొందేందుకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు వెళ్తున్నారు.


 ప్రస్తుతం వైరల్‌ అవుతున్న మీమ్‌

గతంలో ఓ మీడియా ఛానెల్‌తో మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పీకేను తట్టుకోలేమని అందుకే వదిలించుకున్నామని చెప్పారు తెలంగాణ గురించి మొత్తం తమకే తెలుసు అన్నట్టుగా పీకే బృందం వ్యవహరిస్తుందని, పార్టీని తామే నడుపుతామన్నట్టుగా ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. కేసీఆర్‌కు మించిన రాజకీయ వ్యూహకర్త ఎవరూ లేరని అందుకే తాము ఈ ఎన్నికల్లో పీకే లాంటివారిని పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు.
- సిమ్మాదిరప్పన్న

>
మరిన్ని వార్తలు