ఆ భేటీ వెనుక కథేంటంటే.. : మంత్రి అంబటి

23 Dec, 2023 18:31 IST|Sakshi

టీడీపీ.. ఏనాడో చచ్చిన శవం

ఎంత మంది పీకేలు వచ్చినా ఊపిరిపోయలేరు

పోస్టుమార్టంకే ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) పనికొస్తాడేమో?

‘పీకే’లు ఎంత మంది వచ్చినా సీఎంను జగన్‌ను ఓడించలేరు.

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మంత్రి అంబటి రాంబాబు సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు, ప్రశాంత్‌ కిషోర్‌ భేటీపై మంత్రి అంబటి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. 

అంబటి సూటి ప్రశ్నలు..
ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు
పార్టీపై కాన్ఫిడెన్స్‌ లేనప్పుడే పీకే వ్యూహం అవసరమన్న లోకేశ్‌
ఇప్పుడు టీడీపీపై కాన్ఫిడెన్స్‌ తగ్గిందని ఆయన్ను రప్పించారా?

ఆనాడు పీకేను నోటికొచ్చినట్లు తిట్టిన తండ్రీ కొడుకులు
ఇప్పుడు అదే పీకేతో మంతనాలు.. వ్యూహ రచనలు
ఇవీ పూర్తిగా గతి తప్పిన తండ్రీ కొడుకుల రాజకీయాలు
బాబు, లోకేశ్‌ల ద్వంద్వ వైఖరి ప్రజలు గమనించాలి

టీడీపీ వ్యూహకర్తగా రాలేనన్న ప్రశాంత్‌ కిషోర్‌
అయినా ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుని రప్పించారంట!.

ఆ కలయిక ఆశ్చర్యకరం..
టీడీపీ వ్యూహకర్త ‘పీకే’ అనగానే.. నాలో కించిత్‌ ఆశ్చర్యం కలిగింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన బీహార్‌కు చెందిన ప్రశాంత్‌ కిశోర్‌ ఈరోజు చంద్రబాబు, లోకేశ్‌ను కలిశారని మీడియాలో చూశాం. ఆయన తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారని మీడియాలో వచ్చింది. ఢిల్లీ నుంచి ఆయన వస్తుంటే రిసీవ్‌ చేసుకోవడానికి లోకేశ్‌ ఎయిర్‌పోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. ఈ సంఘటన చూసినప్పుడు నాకు కించిత్‌ ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకనేది గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి.

ఆనాడేమో బీహార్‌ డెకాయిట్‌..
ప్రశాంత్‌ కిశోర్‌ ఒక రాజకీయ వ్యూహకర్త. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన వ్యూహకర్తగా పని చేసిన సందర్భాలున్నాయి. అతని వృత్తి అది. గతంలో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పని చేశారు. ఇక్కడ మేము స్పష్టంగా తెలియపరుస్తున్న విషయం ఏమంటే, ఆయన మా పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రోజుల్లో ఇదే చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ ఏం మాట్లాడారు? ఆయనపై ఎలాంటి కామెంట్స్‌ చేశారనేది గుర్తు చేసుకోవాలి. ‘ఆయన (ప్రశాంత్‌ కిషోర్‌) పీకే కాదు. బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు. బీడీ అంటే బీహార్‌ డెకాయిట్‌’ అని ఆనాడు చంద్రబాబు విమర్శించారు. దీన్ని తెలుగు ప్రజలు గుర్తు చేసుకోవాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.

‘పీకే’ తోక కత్తిరిస్తామంటూ..
ఎక్కడ్నుంచో పీకే అంట.. బీహార్‌ నుంచి వచ్చాడంట. ఆయన తోక కత్తిరిస్తాం.. ఇక్కడకొచ్చి ఆయనేం చేస్తాడు.. ఏమీ చేయలేడు..’ అంటూ తండ్రీకొడుకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అంతేకాదు, కోడికత్తి గురించి.. బాబాయిని హత్య చేయించారంటూ.. మతకల్లోలాలు సృష్టించారు.. ఎన్నెన్నో హత్యలు చేయించారంటూ.. ఇవన్నీ కూడా బీహార్‌ నుంచి వచ్చిన డెకాయిట్‌ ప్రశాంత్‌ కిశోర్‌నే చేయించాడని సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు నోటికొచ్చినట్లు దుయ్యబట్టారు.

తండ్రీకొడుకుల దిగజారుడుతనం..
అప్పట్లో మంత్రిగా ఉన్న లోకేశ్‌ కూడా పీకే గురించి ఏమన్నాడంటే.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నేతలపై నమ్మకం లేకనే పీకేను తెచ్చుకున్నామంటూ మాట్లాడాడు. ఇవన్నీ నేను ఇప్పుడెందుకు గుర్తు చేస్తున్నానంటే.. చంద్రబాబు, లోకేశ్‌ ఎంతగా దిగజారిపోతారో అందరూ గుర్తించాలి. అవసరమైతే, వారిద్దరూ ఎవరి కాళ్లయినా ఎలా పట్టుకుంటారో కూడా ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. 

సొంత పార్టీపైన వారికి నమ్మకం లేకేనా?..
ఒకప్పుడు బీహార్‌ డెకాయిట్‌ అన్నటువంటి ప్రశాంత్‌ కిశోర్‌నే మా పార్టీకి వ్యూహకర్తగా కావాలంటూ.. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ ఢిల్లీ వెళ్లి ఆయన్ను బతిమిలాడి తెచ్చుకున్నారు. అంటే, వారికి వారి పార్టీ మనుగడపై కాన్ఫిడెన్స్‌ లేదనేది తేటతెల్లమైందని గుర్తు చేస్తున్నాను. ఈ విషయం ప్రజలకు కూడా అర్ధమై ఉంటుందనుకుంటున్నాను. 

ఎంత మంది ‘పీకే’లు వచ్చినా..
ఆ పీకే (పవన్‌ కళ్యాణ్‌) అయినా.. ఈ పీకే (ప్రశాంత్‌ కిషోర్‌) అయినా తెలుగుదేశం పార్టీని బతికించే పరిస్థితి లేదని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నేనొక విషయాన్ని అందరి దృష్టికి తెస్తున్నాను. ‘మెటీరియల్‌ మంచిది కాకపోతే, మేస్త్రీ ఏం చేస్తాడు..?’ అని అంటున్నాను. ఇదే విషయాన్ని ఇప్పటికే నేను ట్వీట్‌ ద్వారా కూడా ప్రజలకు వివరించాను. సో.. ఎంతమంది మేస్త్రీలు వచ్చినా మెటీరియల్‌ బాగ లేకపోతే ఏం చేసేది లేదని రాష్ట్ర ప్రజలతో పాటు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అర్ధం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 

చచ్చిన శవం టీడీపీ.. పోస్టుమార్టంకే పీకే..
వైద్యులు రెండు రకాలుగా పనికొస్తారంట. ఒకటి చికిత్స చేయడానికి.. రెండు చనిపోయినప్పుడు పోస్టుమార్టం చేయడానికి పనికొస్తారట. కనుక, ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ అనే వ్యూహకర్త చనిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి పోస్టుమార్టం చేయడానికి మాత్రమే పనికొస్తాడు తప్ప ప్రాణం పోయడానికి పనికిరాడనే వాస్తవాన్ని ఇవాళ కాకపోతే రేపైనా అర్ధమౌతుంది. అందుకే ఎంతమంది ప్రశాంత్‌ కిశోర్‌లైనా.. ఎంత మంది పవన్‌కళ్యాణ్‌లు కట్టకట్టుకుని వచ్చినా.. ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించడం అంతకన్నా సాధ్యం కాదనే విషయం అర్ధం చేసుకోవాల్సిందిగా చెబుతున్నాను. 

రానంటే.. కాళ్లు పట్టుకున్నారట!..
తెలుగుదేశం పార్టీకి కొత్త వ్యూహకర్త అవసరమొచ్చింది. అంటే, రాబిన్‌శర్మ పని అయిపోయిందన్నమాట. ఇంతకుముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు. ఇంకా దిగజారిపోయిందని అర్ధం. చంద్రబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో వేస్తే.. లోకేశ్‌ సడన్‌గా ఢిల్లీలో మాయమై.. పీకే దగ్గరకు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకున్నాడని చెప్పారు. అప్పుడు పీకే నేను రానన్నాడు. తెలుగుదేశం పార్టీ అనేది చచ్చిన పాము. దాన్ని నేను బతికించలేనని చెప్పినా కూడా.. పీకే కాళ్లు పట్టుకుని బతిమాలుకుని ఇక్కడకు రప్పించారనే సంగతిని మేమూ వింటున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అంటూ కామెంట్స్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు