పోరుబాట

2 Apr, 2016 02:48 IST|Sakshi

కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్‌పై ఆర్యవైశ్యుల ఆగ్రహం
నేడు కీలక సమావేశం
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
సంఘాలన్నీ తరలిరావాలని పిలుపు

 
 
సాక్షిప్రతినిధి, అనంతపురం:- ఆర్యవైశ్యులపై అధికారపార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. మొన్న గాంధీ విగ్రహావిష్కరణకు అడ్డుపడటం...నేడు కరెంటు బిల్లులపేరుతో కల్యాణ మండపాన్ని సీజ్ చే యడం చూస్తే అధికారపార్టీ నేతల శైలిని స్పష్టం చేస్తున్నాయి. మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కావాలనే ఈ రకంగా వేధింపులకు పాల్పడి వారిని అగౌర పరచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన ఆర్యవైశ్యులు అధికార పార్టీ నేతల వైఖరిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమను తీవ్రంగా అవమానిసిస్తున్న అధికార పార్టీపై పోరుబాటకు సిద్ధమయ్యారు.

 నేడు కీలక సమావేశం
అధికార  పార్టీ నేతలు, అధికార యంత్రాంగం చేస్తున్న చర్యలు వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసినట్లు వారు భావిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులంతా శనివారం సమావేశం కానున్నారు. ఈ భేటిలో అధికారపార్టీ ఆగడాలపై చర్చించనున్నారు.గాంధీ విగ్రహ ప్రారంభానికీ అడ్డంకులు ‘అనంత’ క్లాక్‌టవర్ వద్ద గాంధీ విగ్రహం ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చే విషయంలో మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆర్యవైశ్యులను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు వారు భావిస్తున్నారు. అయినా వారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విగ్రహావిష్కరణకు అంతర్గతంగా అడ్డుపడుతూనే ఉన్నారనే భావనలో వారు ఉన్నారు.

ఏడాదికిపైగా గాంధీ విగ్రహానికి ముసుగేశారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నెలరోజుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించకపోతే తానే ఆవిష్కరిస్తానని ‘అనంత’లో మీడియా ముందు గతేడాది బీరాలు పలికారు. కేవలం ప్రభాకర్ చౌదరిపై వ్యతిరేకతతోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి అలా మాట్లాడారని, గాంధీ విగ్రహంపై చిత్తశుద్ధి ఉంటే నెల దాటి నెలలు గడుస్తున్నా ఆయన ఏమయ్యారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

 రాజకీయ దురుద్దేశమే కారణమా..?
తాజాగా కొత్తూరు అమ్మవారిశాల కల్యాణ మండపం సీజ్ చేయడం వెనుక కూడా రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలక వర్గంలోని కీలక నేతల సూచనలతోనే అధికారులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ విషయం శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యులు తీవ్రంగా స్పందించారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకే ‘అనంత’లోని వైశ్య హాస్టల్‌లో శనివారం సమావేశం అవుతున్నారు. దీనికి అన్ని సంఘాలు తరలిరావాలని కొత్తూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మచ్చా నరసింహులు పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న పరిణామాలన్నీ రాజకీయ దురుద్దేశంతోనే జరుగుతున్నవేని తెలుస్తుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఫోన్‌లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నట్లు తెలిసింది.

కాగా కొత్తూరు అమ్మవారి శాలతో పాటు పాతూరు అమ్మవారి శాల కల్యాణ మండపాన్ని సైతం సీజ్ చేయడానికి అడిషనల్ కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, డీసీ అజయ్‌కిశోర్, ఆర్‌ఓ నవనీతకృష్ణ తదితరులు గురువారం వెళ్లారు. అయితే నగర పాలక సంస్థ కమిషనర్ ఓబులేసు చివరి నిమిషంలో కలుగజేసుకోవడంతో అధికారులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఇదంతా గమనిస్తున్న ఆర్యవైశ్య ప్రముఖులు పక్కా ప్రణాళికతోనే తమను లక్ష్యంగా చేసుకుని అధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు