ఈ ఏడాది కాస్త ఎక్కువ వర్షపాతం

2 Apr, 2016 02:54 IST|Sakshi
ఈ ఏడాది కాస్త ఎక్కువ వర్షపాతం

భారత వాతావరణ శాఖ, స్కైమెట్ సంస్థల అంచనా
 

 న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో బలహీన పడుతున్న ఎల్‌నినో ప్రభావంతో  ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే ఉండొచ్చని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వరుసగా రెండేళ్లపాటు ముఖం చాటేసిన వర్షాలు ఈ ఏడాది రైతుల్ని ఆనందంలో ముంచెత్తనున్నాయని భావిస్తున్నారు. భారత వాతావరణ శాఖ, ఓ స్వతంత్ర వాతవరణ అంచనా సంస్థ స్కైమెట్ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య దేశంలో 89 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మంచి వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశాయి.

‘ఎల్‌నినో బలహీన పడుతుండటంతో ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుంది. ఇది కచ్చితంగా రైతులకు శుభవార్తే. ఇది ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై మంచి ప్రభావం చూపుతుంద’ని స్కైమెట్ సంస్థ డెరైక్టర్ మహేశ్ పలావత్ మీడియాకు తెలిపారు.  దేశవ్యాప్తంగా ఈ ఏడాది 100 నుంచి 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషకుల అంచనా. ఈ ఏడాది జూన్‌లోనే  సాధారణ వర్షపాతం కంటే 25 శాతం ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వాతావరణ ప్రమాద నిర్వహణ సంస్థకు చెందిన సీనియర్‌విశ్లేషకులు కంటి ప్రసాద్ తెలిపారు. ఈశాన్యభారతంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కానీ, దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదవుతుంద న్నారు.

మరిన్ని వార్తలు