హే.. కృష్ణా!

5 Nov, 2014 02:41 IST|Sakshi
హే.. కృష్ణా!

 వాడుకున్న నీటి కంటే వృధా అయిన నీరే ఎక్కువ
 గత 52 ఏళ్లలో 42 వేల టీఎంసీలు సముద్రం పాలు
  గడచిన పదేళ్ల కాలంలోనే 5,077 టీఎంసీలు వృథా
  సగటున ఏడాదికి 800 టీఎంసీలపైనే సాగరంలోకి...
  బ్యారేజీ దిగువన నీటి నిల్వలకు ప్రతిపాదనలు కరువు
  మిగులు జలాలకోసం నాడు పులిచింతల మొదలుపెట్టిన వైఎస్
 
 సాక్షి, విజయవాడ బ్యూరో:  సాగునీటి వాడకంపై సమర్థవంతమైన ప్రణాళికలు లేకపోవడంతోపాటు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తోన్న నిధుల కొరత రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను దెబ్బతీస్తోంది. భారీ వర్షాల సమయంలో ఎగువ నుంచి భారీస్థాయిలో వస్తోన్న వరద నీటిని ఎక్కడికక్కడ రిజర్వాయర్లలో నిల్వ చేసుకోవడం, అవసరాన్ని బట్టి వాడుకోవడంలో ఏటా అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. గడచిన 52 ఏళ్ల కాలంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 42,087 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేయడం ఇందుకు నిదర్శనం. గడచిన పదేళ్ల సాగునీటి వాడకపు గణాంకాలను పరిశీలించినా ఇదే నిజమని స్పష్టమవుతోంది. 2004-05 నుంచి ఇప్పటివరకూ 1,933 టీఎంసీల నీటిని వాడుకోగా, సముద్రంలోకి వదిలింది మాత్రం 5,077 టీఎంసీలు. ఈ గణాంకాలను చూసి కృష్ణా రివర్‌బోర్డు అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తప్ప మిగతా నాయకులెవ్వరూ సర్‌ప్లస్ వాటర్‌పై దృష్టి కేంద్రీకరించకపోవడం డెల్టా రైతులకు శాపంగా మారింది.

 ఉమ్మడి కేటాయింపు 811 టీఎంసీలు
 ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నపుడు కృష్ణా జలాల కేటాయింపులు 811 టీఎంసీలు. తుంగభద్ర, రాజోలిబండ డైవర్షన్ స్కీం, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆయకట్టు భూములతో తాగునీటి అవసరాలకూ ఈ నీటినే వాడాలి. రాష్ట్ర విభజన జరిగాక  ప్రాజెక్టుల్లోని నీటికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. సాగునీటి కోసం అవసరమని ఆంధ్రప్రదేశ్, విద్యుదుత్పత్తికి కావాలంటూ తెలంగాణ రాష్ట్రాలు నీటి వినియోగంపై వాదులాడుకుంటున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో ఏర్పడ్డ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్ని చూసి మళ్లీ కరువు తప్పదంటూ ఆందోళన చెందుతున్న ప్రభుత్వాలు అందివచ్చిన వరద నీటిని సమర్థంగా వినియోగించుకోవడంలో వెనుకబడ్డాయి. ఫలితంగా అన్నదాతలకు ఏటా సాగునీటి తిప్పలు తప్పడం లేదు.

 వాడుకున్న నీటి కంటే వృధానే ఎక్కువ...
 కృష్ణాబేసిన్‌కు చివరనున్న కృష్ణా డెల్టా ప్రాంతంలో నదీజలాల వాడకపు గణాంకాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. 2004-05 నుంచి 2014-15 ఖరీఫ్ సీజను వరకూ 7,010 టీఎంసీల నీరు బ్యారేజీకి చేరగా అందులో 1,933 టీఎంసీలనే తాగు, సాగు అవసరాలకు వినియోగించారు. మిగతా 5,077 టీఎంసీల నీరూ సముద్రంలో కలిసింది. నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారం ఒక టీఎంసీ (థౌజెండ్ మిలియన్ క్యూసెక్స్) నీటితో ఆరున్నర నుంచి ఏడు వేల ఎకరాల మాగాణి, 14 వేల మెట్ట భూములను సాగులోకి తీసుకురావచ్చు. నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీల మధ్య నీటి నిల్వలకు ఏడాది కిందట వరకూ ఎటువంటి ప్రాజెక్టులు, రిజర్వార్లు లేనందున వరదనీటిని పెద్ద మొత్తంలో సముద్రంలోకి వదిలారు. దీన్ని గుర్తించిన వైఎస్ పులిచింతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఏడాది కిందట దీన్ని ప్రారంభించినా పూర్తి సామర్థ్యంలో (45 టీఎంసీలు) నీటిని నిల్వ చేయలేని పరిస్థితి. దీంతో ఈ ఏడాది కూడా ఇప్పటివరకూ 54 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదలాల్సి వచ్చింది. రెండు రోజుల కిందట హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైన కృష్ణా రివర్‌బోర్డు అధికారులు బేసిన్ పరిధిలో నీటి వాడకం, సర్‌ప్లస్ వాటర్ వివరాలను పరిశీలిస్తున్నారు.

 బ్యారేజీ దిగువన నీటి నిల్వకు చెరువులు...
 వృధాగా సముంద్రంలోకి వెళ్లే జలాలను నిల్వ చేసుకుని అటు తాగు, ఇటు సాగునీటిగా వాడుకునేందుకు వైఎస్ కాలంలోనే ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టారు. అయితే 2009లో వచ్చిన భారీ వరదల తరువాత ప్రభుత్వం వీటి సంగతినే మర్చిపోయింది. ప్రకాశం బ్యారేజీ నుంచి హంసలదీవి వరకూ సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బ్యారేజీ నుంచి దిగువకు విడుదలయ్యే నీటిని అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాల్లో 20 టీఎంసీల వరకూ నిల్వ చేయాలన్న ఆలోచన అటకెక్కింది. ఇక్కడి ప్రాంతం రాజధానిగా అభివృద్ధి చెందనున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు బాగా పెరిగే వీలుంది. బ్యారేజీ రిజర్వాయర్‌లో మూడు టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయడం సాధ్యం కాదు. ప్రకాశం బ్యారేజీ 10 కిలోమీటర్ల ఎగువన మరో బ్రిడ్జి కం బ్యారేజీని నిర్మిస్తేగానీ కొంత మేర సమస్య పరిష్కారం కాదు.

మరిన్ని వార్తలు