బడ్జెట్లో సంక్షేమానికే ప్రాధాన్యం: ఈటెల | Sakshi
Sakshi News home page

బడ్జెట్లో సంక్షేమానికే ప్రాధాన్యం: ఈటెల

Published Wed, Nov 5 2014 6:22 AM

బడ్జెట్లో సంక్షేమానికే ప్రాధాన్యం: ఈటెల

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్: ఈటెల
మా ప్రాథమ్యాలను ఇందులో ఆవిష్కరించబోతున్నాం
కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువ లేదు
నిధుల సమీకరణకు మార్గాలున్నాయి.. కేంద్ర నిధులు వస్తాయి
ఆదాయం పడిపోతుందంటూ కొన్ని దుష్టశక్తులు ప్రచారం చేస్తున్నాయి
తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్రలు జరుగుతున్నాయి
రైతుల ఆత్మహత్యల నివారణకు దీర్ఘకాలిక చర్యలు చేపడతామని వెల్లడి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధికి తోడ్పడేలా తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలపై ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తాను ఎన్నోసార్లు కొట్లాడానని.. అయినా ఆంధ్రా పాలకులు ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదన్నారని పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం కలిగినందుకు సంతోషంగానూ, గర్వంగానూ అనిపిస్తోందని ఈటెల చెప్పారు. బుధవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో..  ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రాథమ్యాలు, స్వరూపం, భవిష్యత్ లక్ష్యాలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
‘‘ఆకలితో అలమటిస్తున్న అణగారిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మా బడ్జెట్ ఉండబోతోంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటివరకూ రూ. 200గా ఉన్న పింఛన్లును రూ. 1,000కి, రూ. 500 పింఛన్లను రూ. 1,500కు పెంచాం. కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని ఆరు కేజీలకు పెంచాం. 20 కేజీల బియ్యం పరిమితిని తీసేశాం. వ్యవసాయంతో గ్రామ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉన్నందున ఈ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పేద దళిత యువతుల వివాహాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాం.
* తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రరూపం చేసి రాష్ట్రాన్ని ఎలా సాధించామో... అలాగే మా ప్రభుత్వం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రాజెక్టులను అమలుచేసి తీరుతాం. మా ప్రాథమ్యాలను బడ్జెట్ రూపంలో ఆవిష్కరించబోతున్నాం. నిధుల సమీకరణకు మా మార్గాలు మాకున్నాయి. ఏడాదిలోనే మా సృజనాత్మకత ఏమిటో చూపెడతాం.
 
దుష్టశక్తుల ప్రచారమది..

కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవాలని మాకేం లేదు. గత ప్రభుత్వాలు ఎలాంటి సంబంధాలు కొనసాగించాయో... మేం కూడా అదే రీతిన వ్యవహరిస్తాం. నిద్రపోయేవాళ్లను లేపొచ్చు గానీ, నిద్ర నటించే వాళ్లను లేపలేం కదా. టీడీపీ, బీజేపీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణలో ఆదాయం పడిపోతుందని, మా ప్రభుత్వంపై కొంత విషప్రచారం జరుగుతోంది. కొత్త రాష్ట్రంలో ఆదాయానికి, వనరులకు కొదువలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసే కొన్ని దుష్ట శక్తుల వల్లే ఇటువంటి ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాల ప్రజలు బాగానే ఉన్నారు. తెలంగాణలో పాలన సజావుగా జరగవద్దనే సంకుచిత మనస్తత్వంతో వ్యవహరించడం సమంజసం కాదు.
 
నిధులు తప్పకుండా వస్తాయి..

కేంద్రంతో ఘర్షణకు, నిధులకు సంబంధం లేదు. 13వ ఆర్థిక సంఘం నిధులు ఎలా వచ్చాయో, 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా అలాగే వస్తాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, మాకు రావాల్సిన గ్రాంట్లు కేంద్రం నుంచి తప్పకుండా వస్తాయి. కొత్త రాష్ట్రానికి అవసరమైన మేరకు కేటాయింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఈ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది.
 
ఏళ్లుగా ఉన్న సమస్యల వల్లే..

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు ఒక నెల, ఒక ఏడాదిలో వచ్చే సమస్యలు కారణం కాదు. అనేక ఏళ్లుగా ఉన్న సమస్యలే కారణం. పంటలు ఎండిపోయి, అప్పుల పాలై, ఏదిక్కూ లేని పరిస్థితుల్లోనే రైతులు ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎండిపోతున్న బోర్లు, బావులు, కాలిపోతున్న మోటార్లు, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం ఆత్మహత్యలకు కారణాలు. 1984 నుంచి ఇప్పటివరకు 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలే అయింది. ఈ సమస్యలకు మూలాలను అర్థం చేసుకొని వాటిని నివారించాలనే మా ప్రయత్నం. పైసలిచ్చినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నాం. మా ప్రభుత్వం చేపట్టిన పథకాలు అమలయ్యాక ఆత్మహత్యలు కొనసాగితే అప్పుడు మాది బాధ్యత అవుతుంది.
 
హామీలన్నీ నెరవేరుస్తాం..

ఉద్యమకారులుగా మా గమ్యాన్ని చేరాం. పాలకులుగా కూడా ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తాం. ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాం. టాస్క్‌ఫోర్స్ నివేదికలు తెప్పించుకున్నాం. అన్ని అంశాలను బేరీజు వేసుకొని బడ్జెట్‌ను రూపొందించాం. 14 ఏళ్లుగా మాపై విశ్వాసం ఉంచారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను సాధించాం. ఆంధ్రా పార్టీల, ఆంధ్ర మీడియా రణ గొణ ప్రచారాలని నమ్మకుండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నా. బంగారు తెలంగాణను నిర్మించేదాక ఈ ప్రభుత్వం నిద్రపోదు.

Advertisement
Advertisement