ముల్లె సర్దిన పల్లె

1 Oct, 2018 13:19 IST|Sakshi
వలస వెళ్లేందుకు ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న రైతులు

జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఊపందుకున్న వలసలు

సుదూర ప్రాంతాలకు వ్యవసాయ కూలీల పయనం

చిన్న, సన్నకారు రైతులను సైతం కాటేసిన కరువు  

సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలం

ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి..రబీ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేవు.వస్తాయన్న ఆశా లేదు. కరువు విలయ తాండవం చేస్తోంది. కుటుంబాలు గడవడమే కష్టమైపోతోంది. ఈ తరుణంలో వలసలే దిక్కవుతున్నాయి. పొట్టకూటి కోసం పిల్లాపాపలతో సుదూర ప్రాంతాలకు పల్లె ప్రజలు పయనమవుతున్నారు. వ్యవసాయ కూలీలే కాదు..చిన్న, సన్నకారు రైతులు సైతం మూటాముల్లె సర్దుతున్నారు.  

కర్నూలు, ఆదోని టౌన్‌:     ఆదోని డివిజన్‌..కరువుకు పెట్టింది పేరు. వరుసగా నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేవు. తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా..ఎప్పుడూ వాటా నీరు రాలేదు. టీబీ డ్యాంలో గరిష్ట స్థాయి నీటి మట్టమున్నా..ఆయకట్టు తడవడం లేదు. వర్షాధారంపై ఆధారపడి సాగుచేస్తున్న పంటలు పండడం లేదు. ఈ ఏడాది జూన్‌లో మురిపించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పంటల సాగు చేసిన అప్పులు భారమయ్యాయి. రబీలోనైనా పంటలు సాగు చేద్దామంటే..ఆ పరిస్థితులూ కనిపించడం లేదు. ఎండలు మండిపోతూ వేసవి తలపిస్తున్నాయి. పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చేందుకు సన్న, చిన్న కారు రైతులు బెంగళూర, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. మూడు రోజులుగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లు బెంగళూరుకు వలస వెళ్లే కూలీలతో కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి రోజుకు 500 కుటుంబాలకు పైగానే  బెంగళూరుకు వలస వెళ్తున్నాయి. రైల్వే స్టేషన్‌లోనూ వందలాది కుటుంబాలు కనిపిస్తున్నాయి.   

ఎలా బతకాలి?  
నాకున్న రెండెకరాల పొలంతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకున్నాను. వ్యవసాయ పనులు, పంటల సాగుకు దాదాపు రూ.30వేలు దాకా పెట్టుబడి పెట్టాను. కౌలు కూడా రాలేదు. ఎలా బతకాలి? భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు, వయసు మీదపడిన తల్లిదండ్రులు ఉన్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక బెంగళూరుకు వలస వెళ్తున్నాం.     – బీరప్ప, రైతు, సుంకేసుల

మరిన్ని వార్తలు