వెంటాడిన మృత్యువు | Sakshi
Sakshi News home page

వెంటాడిన మృత్యువు

Published Mon, Oct 1 2018 1:17 PM

Brothers Died In Road Accidents Guntur - Sakshi

గుంటూరు, దాచేపల్లి : విధి ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. ద్విచక్రవాహనం అంటే భయమని మొత్తుకున్నా సహోద్యోగుల ఒత్తిడితో బైక్‌ ఎక్కి మృత్యు ఒడిలోకి చేరాడు ఆ యువకుడు.  20 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో పెద్ద కుమారుడిని కోల్పోయి క్రుంగిపోయిన ఆ తల్లిదండ్రులకు, తాజాగా చిన్న కుమారుడి మరణవార్తను వినగానే నిశ్చేష్టులయ్యారు. 

వివరాల్లోకి వెళితే.. దాచేపల్లి మండలం కేసానుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ప్రసాదరావు, హేమలత దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె.  పెద్ద కుమారుడు కరుణాకర్‌ 12 ఏళ్ల వయస్సులో దాచేపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొట్టి మృతిచెందాడు. చిన్నకుమారుడు విజయ్‌కుమార్‌ బీటెక్‌ చదివి బ్యాంకులో ఉద్యోగం సాధించాడు. ఈ ఏడాది మే 28న విజయ్‌కుమార్‌కు విశాఖకు చెందిన రామలక్ష్మీతో వివాహమైంది. విజయ్‌కుమార్‌ ఉద్యోగం సాధించిన తరువాత ద్విచక్రవాహనం తీసుకొమ్మని తండ్రి చెప్పాడు. తనకు మోటర్‌సైకిల్‌ నడపటం రాదని..పైగా తనకు భయమని, తాను రోజు బస్సులోనే ప్రయాణం చేస్తానని విజయ్‌కుమార్‌ తండ్రికి చెప్పాడు. శనివారం బ్యాంక్‌లో విధులు ముగించుకుని గురజాల బస్టాండ్‌కు వస్తున్న క్రమంలో తన తోటి ఉద్యోగి ద్విచక్రవాహనంపై రమ్మని పిలిస్తే సున్నితంగా తిరస్కరించాడు. సహ ఉద్యోగి బతిమిలాడటంతో అయిష్టంగా ద్విచక్రవాహనం ఎక్కి దాచేపల్లికి బయలుదేరగా అంబాపురం వద్ద లారీ ఢీకొట్టటంతో విజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు సొమ్మసిల్లి పడిపోయారు. వారు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశ్రునయనాల మధ్య విజయ్‌కుమార్‌ అంత్యక్రియలు ఆదివారం కేసానుపల్లిలో జరిగాయి. పలువురు బ్యాంక్‌ అధికారులు విజయ్‌కుమార్‌ మృతదేహం వద్ద నివాళులర్పించారు.

Advertisement
Advertisement