కార్మిక మంత్రి ఇలాకాలో ఆకలి కేకలు!

16 Mar, 2016 01:41 IST|Sakshi
కార్మిక మంత్రి ఇలాకాలో ఆకలి కేకలు!

 కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో కార్మికులు ఆకలికేకలు పెడుతున్నారు. పరిశ్రమలు వరుసగా మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, మంత్రి చొరవ చూపకపోవడంపై కార్మికసంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా సింగుపురం సమీపంలోని నీలం జూట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సస్పెన్షన్ ఆఫ్ ప్రొడక్షన్ పేరిట తాళం వేయడంతో 900 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పారిశ్రామిక నూతన విధానం అంటూ హడావుడి చేస్తున్న నేతలు జిల్లా విషయానికొచ్చేసరికి కార్మికులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని, ఔత్సాహికులకు ప్రోత్సాహం లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. యాజమాన్యాల కొమ్ము కాస్తున్న జిల్లా మంత్రికి త్వరలోనే బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడగా, 12 పరిశ్రమలు మూతపడ్డాయి.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అనేక పరిశ్రమలు ఏడాది కాలంలో మూతపడ్డాయి. వీటిలో ఎక్కువగా జూట్ మిల్లులే ఉన్నాయి. 30 ఏళ్ల నుంచి ఉత్పత్తి కొనసాగిస్తున్న నీలం జూట్‌మిల్లు ప్రస్తుతం నష్టాల్లో ఉందని, ఉత్పత్తి తగ్గిందని, కార్మికులకు ఒప్పందం ప్రకారం వేతనాలివ్వలేకపోతున్నామని పేర్కొంటూ ఆ సంస్థ అధినేత ఎంఎల్ అగర్వాల్ ఆదివారం ప్రకటించేశారు. గతంలో 30 టన్నుల జూట్ ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం పది టన్నులకే పరిమితం అయిపోయిందని పేర్కొంటూ పోలీస్ బందోబస్తు పెట్టేశారు. లాకౌట్ అంటే ఇబ్బంది వస్తుందనే భావనతో సస్పెన్షన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటూ జిల్లా యంత్రాంగంతో చెప్పించడాన్ని కార్మికులు తప్పుబడుతున్నారు. ఒప్పందం ప్రకారం కొత్త వేతనాలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా తొమ్మిది నెలల నుంచి పట్టించుకోకుండా రాత్రికి రాత్రే తలుపులకు తాళం వేసేయడంతో సుమారు 6 వేల మంది రోడ్డునపడ్డారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మరెలా ఉంటుందోనని కార్మికసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మంత్రి సొంత నియోజకవర్గం టెక్కలి పరిధిలో ఇప్పటికే ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమ ఒకటి మూతపడడాన్ని గుర్తు చేస్తున్నారు.
 
 పరిస్థితి ఇలా..
  రాజాం, పైడిభీమవరం, టెక్కలి పరిధిలో 46 పరిశ్రమలు, పలాస పరిధిలో మరో 250 జీడి పరిశ్రమలు, టెక్కలి పరిధిలో 15 గ్రానైట్ పరిశ్రమలున్నాయి. కొన్నేళ్ల క్రితం రాజాంలో వాసవీ జూట్ కార్మికుల ఉద్యమం ప్రారంభమైన తరువాత ముడిసరుకు కొరత వచ్చింది. కొన్నాళ్ల తరువాత సీతారామ జూట్, బాలాజీ జూట్, శ్రీ లక్ష్మీ శ్రీనివాసా జూట్ మిల్లులు మూతపడ్డాయి. భారీ, మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల్లో ఇటీవల సింథటిక్, స్టీల్, జూట్ మిల్లులు ఇలా మొత్తం 12 మూత పడ్డాయి. తాజాగా నీలం జూట్‌మిల్లు మూతపడడ
  కార్మికమంత్రి తమ జిల్లాకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొందూరు, రాజాం పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న జూట్ మిల్లుల పరిస్థితి కూడా దారుణంగానే ఉంది.
 
 గోగునార రైతులకు ప్రోత్సాహం కరువు
 జిల్లాలో గోగునార రైతులకు ప్రోత్సాహం కరువైంది. రైతాంగాన్ని ఆదుకునేందుకు సర్కార్ ముందుకు రావడం లేదు. స్థానికంగా ఉన్న నారను కాదని ‘భీమిలి మెస్తా’ పేరిట ఇతర ప్రాంతాలనుంచి జూట్‌కు యాజమాన్యం ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గోల్ట్ జూట్ పేరిట వివిధ రాష్ట్రాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకుంటున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. జూట్ కార్పొరేషన్‌పై కన్నెర్ర చేసి రాజాం, పొందూరు ప్రాంత వాసులకు అన్యాయం జరిగినా మంత్రి చొరవ చూపలేకపోయారు. ఆహారోత్పత్తుల్లో 50 శాతం జూట్ బ్యాగుల్నే వాడాలని జీవోలో ఉన్నా ప్రభుత్వం అమలు చేయకుండా ప్లాస్టిక్‌బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిస్తోందంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. జూట్ మిల్లులో రోజుకు కనీసం రూ.365 వేతనం ఇవ్వాల్సి ఉన్నా.. రూ.260కు మించి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి.  
 
 - మోసం చేస్తున్నారు
 కార్మికుల ఓట్లు కొల్లగొట్టి మంత్రి అయిన అచ్చెన్న ఆ కార్మికుల పొట్టగొడుతున్నారు. జిల్లాలో వరుసగా పరిశ్రమలు మూత పడుతున్నా కార్మికులకు భరోసా ఇవ్వలేకపోయారు. యాజమాన్యం, కార్మికుల మధ్య సక్యత కుదర్చలేకపోయారు. 2013నాటి ఒప్పందం ప్రకారమే వేతనాలిస్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. నీలం జూట్‌మిల్ లాకౌట్ ప్రకటించేసి సస్పెన్షన్ ఆఫ్ ప్రొడక్షన్ పేరిట తాళం వేయడం మోసం చేయడం కాదా? కార్మికమంత్రిగా ఉన్న అచ్చెన్న జిల్లా పరిశ్రమలు, రోడ్డు న పడిన కార్మికుల గూర్చి చొరవ చూపకపోతే ఆందోళన తప్పదు.
 ఎం.తిరుపతిరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు
 

మరిన్ని వార్తలు