అది మావోడికే..

11 Jan, 2014 02:57 IST|Sakshi
  • రూ.147 కోట్ల పనికి అధికార పార్టీ నేత పట్టు
  •  ఎన్‌హెచ్-365 విస్తరణ పనులకు ‘టెండర్’
  •  తాను చెప్పిన వారికే కట్టబెట్టాలని బెట్టు
  •  ఎన్నికల ‘నిధి’ సేకరణకు యత్నాలు
  •  పూర్తిగా సహకరిస్తున్న కేంద్ర మంత్రి
  •  
    సాక్షి ప్రతినిధి, వరంగల్ :  రాజకీయ పయనంలో కీలకమైనది ఎన్నికల పోరు. ఇందులో ముందుండేందుకు ప్రధాన వనరు అరుున నిధుల విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూక్తిని చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన పనులను సొంత వ్యక్తులకు కట్టబెట్టి... ఎన్నికల ఖర్చును సమీకరించుకునే పనిలో వేగం పెంచారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ఇతర కాంట్రాక్టర్లను పక్కనబెట్టే పనిలో పడ్డారు. మంచిగా చెప్పి ఒప్పించడం... వినకుంటే వారిని బెదిరించడం చేస్తున్నారు.

    కొత్తగా మంజూరైన జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.147 కోట్ల ప్యాకేజీ పనుల కాంట్రాక్ట్‌ను కట్టబెట్టే వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కనుసన్నల్లోనే జరుగుతోంది. తన నియోజకవర్గంలో జరిగే ఈ పనుల కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన వారికి ఇస్తే సరిపోతుందని... ఎన్నికల ఖర్చు కోసం ఏమీ ఇవ్వకున్నా ఫర్వాలేదని ఆ ముఖ్య నేత స్పష్టం చేయడంతో కేంద్ర మంత్రి సైతం ఇందుకు తలాడించినట్లు సమాచారం.

    మహారాష్ట్రలోని సిరొంచ నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు 643 కిలోమీటర్ల మేర చేపట్టిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్-365) మన జిల్లాలో ములుగు, నర్సంపేట, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ ప్రాంతాలను కలుపుతూ తానంచర్ల మీదుగా నల్లగొండ జిల్లాకు వెళ్తుంది. మన జిల్లాలో 115 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్లు, రెండో
    ప్యాకేజీలో రూ.127 కోట్లు కేటాయించారు.
     
    ప్రొక్యూర్‌మెంట్ పద్ధతిలో ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. రూ.147 కోట్లతో చేపట్టే ప్యాకేజీ పనులను జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ టెండర్‌ను 7 శాతం పెంచి రూ.157 కోట్లకు ఇప్పిస్తే... మొత్తం ప్యాకేజీలో 10 శాతం కమీషన్ ఇచ్చేలా కాంట్రాక్టర్, అధికార పార్టీ ముఖ్యనేతకు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది. అరుుతే అంచనా మొత్తాన్ని పెంచాలంటే... ఒకే టెండరు దాఖలు చేయాల్సి ఉంటుంది.

    ఈ మేరకు ఎవరూ టెండర్ వేయకుండా కాంగ్రెస్‌కు చెందిన సదరు ముఖ్యనేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పనులను ఇదే తరహాలో తాను అనుకున్న కాంట్రాక్టర్‌కు ఇప్పించిన అనుభవం ఉన్న ఆ నేత... ఇప్పుడు అన్ని పార్టీల వారిని దీనికోసం సంప్రదిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన రూ.147 కోట్ల కంటే అంచనాలను పెంచి అనుకున్న కాంట్రాక్టర్‌కు టెండర్ ఇప్పించేందుకు  కేంద్ర మంత్రి సహకారం కూడా తీసుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.

    మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్ల పనులకు టెండర్లు వేయవద్దని, ఈపీసీ పద్ధతిన టెండర్లు వేస్తే... గతంలో చేసిన పనుల నాణ్యతపై చర్యలు తీసుకునేలా చేస్తానని కేంద్ర మంత్రి స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.  ఎన్నికల తరుణంలో ఈ ఒక్కసారి తమ మాట వినాలని లేకుంటే... బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం.
     

మరిన్ని వార్తలు