బస్సుల్లేక తడ‘బడి’

22 Jul, 2019 09:51 IST|Sakshi
జిల్లా కేంద్రానికి వచ్చే గ్రామీణ బస్సుల కోసం విద్యార్థుల పాట్లు

చాలీచాలని ‘బడి’ బస్సులు

రోజూ విద్యార్థుల ఇక్కట్లు

పాసులు అనుమతించని మెట్రో

సాక్షి, విజయనగరం అర్బన్‌: పట్టణంలో విద్యను అభ్యసించాలంటే గ్రామాణ విద్యార్థికి ప్రయాస ప్రయాణ తప్పడం లేదు. జిల్లాలో విద్యావనరులున్న పట్టణాలకు రవాణా సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చదువులో తెలివి తేటలే కాదు.. తోపులాటలు, ఒంటికాలిపై నిల్చుని ప్రయాణం చేయగల సామర్థ్యం, గంటల కొద్దీ నిరీక్షించగల ఓర్పు వంటి లక్షణాలు విద్యార్థికి పుష్కలంగా ఉండాలి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు మెరుగు పడుతున్న రవాణా వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ సేవలల్లో సౌకర్యాల నాణ్యత పెంచాల్సి ఉంది. గ్రామీణ విద్యార్థుల కళాశాల సమయాలకు అనుగుణంగా బస్సుల సేవలను ఏర్పాటు చేసి రవాణా వ్యవస్థలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. ఆర్టీసీ యాజమాన్యం వీటిపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.

15 బడి బస్సులతో యాతన
గ్రామీణ విద్యార్థులకు విద్యను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఆర్టీసీ సంస్థ బస్సుల ద్వారా ఉచిత, రాయితీ పాసుల ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఇంతవరకు 25 వేల మంది విద్యార్థులకు రాయితీ, ఉచిత పాసులను అందజేశారు. విద్యార్థుల కోసమని ‘బడి బస్సులు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా 15 బస్సులను నిర్వహిస్తున్నారు. బస్సుల సంఖ్య సరిపోకపోవడంతో ప్రధానంగా విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, కొత్తవలస పట్టణాలకు రాకపోకలు సాగించిన విద్యార్థులు నానాయాతన పడుతున్నారు. విజయనగరం, బొబ్బిలి పట్టణాల నుంచి తిరిగి గ్రామాలకు వెళ్లే సమయాల్లోని రూట్లను రద్దు చేయడంతో ప్రైవేటు వాహనాలకు వెళ్లాల్సి వస్తోంది.

దీంతో పాసులున్నా రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు.  విజయనగరం డిపో పరిధిలో పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఇచ్చే రాయితీ, ఉచిత పాసులు నెలకు సరాసరిన 12 వేల వరకూ ఉన్నాయి. వీటిలో ఏడాది వరకూ చెల్లుబాటయ్యే ఉచిత పాసులు ఐదువేలు, మిగిలినవి మూడు నెలలకు రెన్యువల్‌ చేసుకొనే రాయితీ పాసులు. ఉచిత, రాయితీ పాసులకు అర్హత ఉన్న విద్యార్థులు గత ఏడాది కంటే సుమారు రెండు వేల మంది పెరిగారు. బస్సులను మాత్రం పెంచలేదు. జామి, పద్మనాభం, డెంకాడ, నెల్లిమర్ల, గుర్ల, గంట్యాడ, బొండపల్లి, విజయనగరం మండలాల పలుగ్రామాల నుంచి రోజూ జిల్లా కేంద్రంలోని కళాశాలలకు విద్యాభ్యాసం కోసం రాకపోకలు సాగిస్తున్నారు. బడిబస్సులతోపాటు విద్యార్థుల పాసులకు అర్హతగల పల్లెవెలుగు బస్సులు కేవలం 70 బస్సులు మాత్రమే ఉన్నాయి. వీటిలో కళాశాల, పాఠశాలకు అనుకూలమైన సమయాల్లో తిరిగేవి కేవలం 10 మాత్రమే ఉన్నాయి.

రద్దీ వేళ నరకయాతన
పాఠశాల, కళాశాల విద్యార్థులకు రాయితీ పాసులిచ్చి ఆర్టీసీ చేతులు దులిపేసుకుంది. పాసులివ్వడంలో ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన ఆర్టీసీ యాజమాన్యం వాళ్ల రవాణాకు సరిపడా సర్వీసులు నడపడంపై శ్రద్ధ చూపడం లేదు. విజయనగరం డిపో పరి«ధిల్లోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల, కళాశాల వేళల్లో బస్సు సర్వీలకు ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. విజయనగరం పట్టణం పరిధిలో ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నికల్‌ కళాశాలల, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు పరిసర మండలాల గ్రామాల నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పట్టణం నుంచి నెల్లుమర్ల మీదుగా చీపురుపల్లి, గరివిడి మండలాలను కలుపుతూ చిన్న చిన్న గ్రామాల విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.

బొండపల్లి, గజపతినగరం మండలాల కేంద్రాలను కలుపుతూ గ్రామాలు, జామి, గంట్యాడ మండలాల మీదుగా ఎస్‌.కోటకు వెళ్లే రూట్లలో విద్యార్థుల రాకపోకలు ఉంటాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని పట్టణ బస్సు కాంప్లెక్స్‌ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ రూట్లలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వచ్చే సమయాల్లో ఒక్కొక్క బస్సు మాత్రమే ఉండటం వల్ల టాప్‌పై, వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో రద్దీగా ఉన్న ప్రాంతాలకు ఆయా సమయాలలో ప్రత్యేక సర్వీసులకు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పల్లె వెలుగు సర్వీసుల రద్దు
సింహాచలం నుంచి పద్మనాభం, రెడ్డిపల్లి మీదుగా విజయనగరం కేంద్రానికి రాకపోకలు సాగించే ఆర్టీసీ పల్లెవెలుగు సర్వీసులను రద్దు చేసి వాటి స్థానంలో పాసులకు అనుమతి లేని మెట్రో బస్సుల సర్వీసుల ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతాల నుంచి విజయనగరం విద్యాభ్యాసాలకు వచ్చి పోయే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఆ రెండు సర్వీసులు కళాశాల ప్రారంభించిన సమయాలు కావడం మరీ ఇబ్బందికరంగా మారింది. కళాశాలలు ప్రారంభమయ్యే ఉదయం 7.30 గంటల సమయానికి విజయనగరం వచ్చే విధంగా ఉదయం వేళల్లో సింహాచలం నుంచి బయలుదేరే రెండు సర్వీసులను పునఃప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు.

జిల్లా కేంద్రం నుంచి విశాఖ, తగరపువలస మీదుగా భీమిలి వరకు ఈ రూట్లలో సుమారు 10 ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన వందల్లో పేద విద్యార్థులు రాకపోకలు చేస్తుంటారు. కానీ రూట్లలో పల్లె వెలుగులు లేవు.. అన్నీ మెట్రో సర్వీసులే.. విద్యార్థికి ఇచ్చే జనరల్‌ పాసులను మెట్రోల్లో అనుమతించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కళాశాల తరగతుల ప్రారంభ సమయాలకు అనుకూలంగా తిరిగే పల్లె వెలుగు బస్సులను రద్దు చేసి మెట్రోలను ఏర్పాటు చేయడం వల్ల ఆయా రూట్లలో తిరిగే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల వల్ల ప్రయోజనం లేకపోతోంది.

కళాశాల సమయాల్లో నడపాలి
కళాశాల సమయాలకు అందే విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి బస్సులను నడపాలి. సింహాచలం నుంచి రెడ్డిపల్లి మీదుగా విజయనగరం రాకపోకలు సాగించే మార్గంలోని బస్సులు ఈ విధంగా సమయాలను పాటించడం లేదు. సంబంధిత సమయాల్లో పాసులకు అనుమతి లేని మెట్రో బస్సులను వేశారు. దీనివల్ల ఈ మార్గం నుంచి వచ్చిపోయే విద్యార్థులకు పాసులు నిరుపయోగం అవుతున్నాయి.
–రాపాక వెంకటేష్, డిగ్రీ విద్యార్థి, రెడ్డిపల్లి

డిమాండ్‌ ఉంటే నడుపుతాం 
జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోనూ 15 బడి బస్సులను వేశాం. కేవలం రాయితీ, ఉచిత పాసుల విద్యార్థుల విద్యాలయాల సమయాలకు అనుగుణంగా నడిపిస్తున్నాం. విద్యాలయాల్లో ఇంకా ప్రవేశాల గడువు ముగియలేదు. ప్రవేశాలు ముగిశాక మరోసారి విద్యార్థుల డిమాండ్‌ను అన్ని ప్రాంతాల్లోనూ పరిశీలిస్తాం. ఎక్కడైనా డిమాండ్‌ ఉంటే ఆ రూట్లలో బడి బస్సులను వేయడానికి సిద్ధంగా ఉన్నాం.
– ఎ.అప్పలరాజు, ఆర్‌ఎం, ఆర్టీసీ నెక్‌ రీజియన్‌

మరిన్ని వార్తలు