దుకాణాలు మాకొద్దు!

4 Jul, 2019 09:51 IST|Sakshi

348 మద్యం షాపులకు గానూ 260 రెన్యూవల్‌

దశలవారీ మద్య నిషేధం చేస్తామన్న సీఎం వైఎస్‌ జగన్‌

ఈక్రమంలో రెన్యూవల్‌కు ముందుకురాని దుకాణదారులు

సాక్షి, నెల్లూరు: ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీగా మద్య నిషేధం వైపుగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం పలు నిబంధనలు అమలులోకి తీసుసుకువచ్చింది. అధికారులు అందుకు తగినట్టుగానే చర్యలు తీసుకుంటున్నారు. తొలిదశలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. కొత్త పాలసీ తెచ్చేందుకు మరికొంత సమయం పడుతున్న నేపథ్యంలో పాత దుకాణాల లైసెన్స్‌ను రెన్యూవల్‌ చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే బెల్టుషాపులు లేకుండా చేసేందుకు చర్యలు తీవ్రతరం చేయడంతో రెన్యూవల్‌ చేసుకునేందుకు అనేకమంది దుకాణదారులు ఆసక్తి చూపలేదు. దశలవారీ మద్య నిషేధ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి.

మద్యం షాపుల లైసెన్సీ కాలపరిమితిని సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. నెల్లూరు రెవెన్యూ జిల్లాలో 348 మద్యం షాపులకు గానూ 260 షాపుల నిర్వాహకులు మూడునెలల ఫీజు చెల్లించి లైసెన్సును రెన్యూవల్‌ చేసుకోగా మిగిలిన వారు వెనుకంజ వేశారు. దీంతో ఆయా షాపులు మూతపడ్డాయి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెల్టుషాపులను సమూలంగా నిర్మూలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

దీంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు బెల్టుషాపులపై దాడులు ముమ్మరం చేశారు. మద్య నిషేధంలో భాగంగా ఏటా మద్యం దుకాణాలను తగ్గిస్తామని, అక్టోబర్‌ ఒకటి నుంచి ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా రిటైల్‌ మద్యం షాపులు నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో నూతన మద్యం పాలసీ రూపకల్పనకు మరికొంత సమయం పట్టనుండటంతో గత నెల 25వ తేదీన మద్యం దుకాణాల లైసెన్సును మరో మూడునెలలు పొడిగిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.

260 మాత్రమే..
నెల్లూరు ఎక్సైజ్‌ జిల్లాలో 199, గూడూరు ఎక్సైజ్‌ జిల్లాలో 149 మద్యం దుకాణాలున్నాయి. వీటి లైసెన్సీ కాలపరిమితి గతనెల 30వ తేదీన ముగిసింది. అయితే అప్పటికే ప్రభుత్వం మరో మూడునెలలు లైసెన్సీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వ్యాపారులు లైసెన్సీ ఫీజు, పర్మిట్‌ రూమ్‌ ఫీజులో నాలుగో వంతు చెల్లించి లైసెన్సీని రెన్యూవల్‌ చేసుకోవాలని ఆదేశించింది. దీంతో నెల్లూరు ఎక్సైజ్‌ జిల్లా పరిదిలో 199 దుకాణాలకు గానూ 154, గూడూరు ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో 149 దుకాణాలకు గానూ 106 దుకాణదారులు రెన్యూవల్‌ చేసుకున్నారు.  348 దుకాణాలకు గానూ లైసెన్సీ ఫీజు, పర్మిట్‌రూమ్‌ ఫీజుల కింద మూడునెలలకు ప్రభుత్వానికి రూ.16.47 కోట్లు రావాల్సి ఉండగా 88 మంది రెన్యూవల్‌కు ముందుకు రాకపోవడంతో రూ 12.37 కోట్లు వచ్చింది. దీంతో రూ.4.1 కోట్ల రాబడి తగ్గింది.

వెనుకంజ..
దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తొలుత బెల్టుషాపుల నియంత్రణపై దృష్టి సారించారు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు విస్తృత దాడులు చేస్తూ బెల్టును నియంత్రించారు. మరోవైపు ఎంఆర్‌పీ ఉల్లంఘించినా, నిర్ణీత వేళలు పాటించని దుకాణదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా నిబంధనలు అతిక్రమించి ధనార్జనకు అలవాటుపడిన మద్యం షాపు నిర్వాహకులకు ప్రభుత్వ చర్యలు మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితుల్లో మద్యం దుకాణాల లైసెన్సీ కాలపరిమితి మూడునెలలకు పొడిగించినా రెన్యూవల్‌ చేయించుకునేందుకు వెనకడుగు వేశారు. నెల్లూరు ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో 45, గూడూరు ఎక్సైజ్‌ జిల్లా పరిధిలో 43 మద్యం వ్యాపారులు తమ లైసెన్సులను రెన్యూవల్‌ చేసుకోలేదు.  

మరిన్ని వార్తలు