రాహుల్‌ రాజీనామాపై ప్రియాంక గాంధీ కామెంట్‌

4 Jul, 2019 09:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎట్టకేలకు రాహుల్‌ గాంధీ తన పంతం నెగ్గించుకున్నారు. వర్కింగ్‌ కమిటీ వారించినా, పార్టీ శ్రేణులు వద్దని బతిమాలినా వినకుండా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి తనదే బాధ్యత అని అంగీకరించారు. ఇక రాహుల్‌ రాజీనామాపై చెల్లెలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘రాహుల్‌ రాజీనామా నిర్ణయం సాహసోపేతమైంది. అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి రాహుల్‌ లాంటి కొందరికే ధైర్యముంటుంది. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న రాహుల్‌ నాలుగు పేజీల బహిరంగ లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిందే. లేఖ ప్రతులను షేర్‌ చేయడంతో పాటు ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.
(చదవండి : ఓటమికి నాదే బాధ్యత)

ట్విట్టర్‌లో హోదా తొలగింపు 
రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ ప్రొఫైల్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించారు. ప్రస్తుతం ఆయన ట్విటర్‌ ఖాతాలో ‘ఇది రాహుల్‌ గాంధీ అధికారిక ఖాతా/ఇండియన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు/ పార్లమెంటు సభ్యుడు’ అని మాత్రమే దర్శనమిస్తోంది.

మరిన్ని వార్తలు