యార్డు సెక్రటరీ పోస్టుకు పైరవీలు

20 Sep, 2018 08:52 IST|Sakshi

అనుకూలమైన వ్యక్తిని నియమించుకునేందుకు జిల్లా మంత్రి పట్టు 

దుగ్గిరాల యార్డు సెక్రటరీ బ్రహ్మయ్యను గుంటూరు యార్డుకు రప్పించేయత్నం

వేరేశాఖ ఉద్యోగి కావడంతో గతంలోనే అడ్డుచెప్పిన మార్కెటింగ్‌శాఖ అధికారులు

పసుపు కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు  

సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు మార్కెట్‌ యార్డు సెక్రటరీగా తమకు అనుకూలమైన ఉద్యోగిని నియమించుకునేందుకు జిల్లాకు చెందిన ఓ మంత్రి పావులు కదుపుతున్నారు.  ప్రస్తుతం దుగ్గిరాల మార్కెట్‌ యార్డు సెక్రటరీగా ఉన్న బ్రహ్మయ్యను గుంటూరు మార్కెట్‌ యార్డు సెక్రటరీగా బదిలీ చేయించేందుకు మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.  ఈ క్రమంలో మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 

గతంలో ఎంపీడీఓగా పనిచేసిన బ్రహ్మయ్యను నోషనల్‌ ప్రమోషన్‌ ఇచ్చి మార్కెటింగ్‌ శాఖలో డీడీ క్యాడర్‌లో దుగ్గిరాల మార్కెట్‌ యార్డు సెక్రటరీగా నియమించారు. గతంలోనే ఈ నియమాకంపై మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మంత్రి గట్టిగా పట్టు పట్టడంతో చట్టాన్ని తుంగలో తొక్కారు.  ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్దదైన మార్కెట్‌ యార్డుకు సెక్రటరీగా  వచ్చేందుకు మంత్రి ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గుంటూరు మార్కెట్‌ యార్డు సెక్రటరీగా పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డు సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పసుపు అమ్మకాలపై ఆరోపణలు
దుగ్గిరాల మార్కెట్‌ యార్డులో రోజుకు వెయ్యి బస్తాలకు పైగా పసుపు అమ్మకాలు జరుగుతాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్‌లో రైతులు సరుకును అమ్ముకునే వెసులుబాటు ఉంది. మార్కెట్‌ సిబ్బంది బహిరంగ వేలం పెడతారు. దీంట్లో అత్యధిక ధర పాడిన వారికి, రైతు అనుమతితో లాటును కేటాయిస్తారు.  మార్కెట్‌  యార్డు వారు తయారు చేసిన సేల్‌ పట్టి ప్రకారం రైతులకు డబ్బులు కట్టిన తర్వాతనే కోనుగోలు చేసిన వ్యాపారి  రైతు అనుమతితో సరుకును తీసుకువెళ్తారు. ఈ ప్రక్రియ ఆరు దశాబ్దాలుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌ యార్డులో సరాసరి  రోజుకు వెయ్యి బస్తాలు కోనుగోలు జరగాల్సి ఉండగా, కేవలం 100 బస్తాలు మాత్రమే పోతలు పోస్తున్నట్లు,  దీంతో కూలీ గిట్టుబాటు కావటం లేదని  మార్కెట్‌ యార్డులోని హమాలీలు పలు మార్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. గతంలో మార్క్‌ఫెడ్‌ ద్వారా పసుపు కొనుగోళ్లలో అవకతవలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. అయితే మార్కెట్‌లో 100 శాతం ఈ–నామ్‌ పద్ధతిలో పసుపు  కొనుగోళ్లు జరుగుతున్నాయని సీఎం చేతుల మీదుగా బ్రహ్మయ్య అవార్డును అందుకోవడం మార్కెటింగ్‌ శాఖ ఉద్యోగలను ఆశ్చర్యానికి గురి చేసింది.  

గతంలోనూ ప్రయత్నం
గతేడాదే బ్రహ్మయ్యను గుంటూరు మిర్చియార్డు సెక్రటరీగా నియమించాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే మార్కెట్‌ యార్డు చైర్మన్, బ్రహ్మయ్య ఒకే సామాజిక వర్గాని చెందిన వారు కావడంతో ఒక వరలో రెండు కత్తులు ఇమడవనే భావనతో దుగ్గిరాల యార్డు సెక్రటరీగా నియమించినట్లు సమాచారం. తాజాగా ఈ నెల 28తో ప్రస్తుత మార్కెట్‌ యార్డు పాలక వర్గం పదవీ కాలం ముగుస్తోంది. ఈ క్రమంలో బ్రహ్మయ్యను గుంటూరు యార్డు సెక్రటరీగా  తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. మార్కెట్‌ యార్డులో పనులు చక్క దిద్దాలంటే, తమకు అనుకూలమైన అధికారిని ఉండాల్సిందేనని, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులను  మంత్రి పట్టుబడుతున్నట్లు వినికిడి. ఇతర శాఖల అధికారులను మార్కెటింగ్‌ శాఖలో నియమించటం ఏమిటని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు