ఉత్తరాది రాష్ట్రాలకు మదనపల్లె టమాటా

3 Jan, 2015 01:08 IST|Sakshi
ఉత్తరాది రాష్ట్రాలకు మదనపల్లె టమాటా

* మదనపల్లె మార్కెట్లో పుంజుకున్న ధరలు
* రైతుల్లో ఆనందం
* రోజుకు 50 నుంచి 60 లోడ్ల ఎగుమతి

మదనపల్లె: మదనపల్లె మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు టమాటా ఎగుమతి పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా రోజుకు 50 నుంచి 60 లోడుల(300 టన్నులు) వరకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో రెండు నెలల నుంచి మంచి ధరల్లేక దిగాలుపడ్డ రైతులకు కాస్త గిట్టుబాటు ధర లభిస్తోంది. నెల రోజుల క్రితం మొదటి రకం టమాటా పది కేజీల బుట్ట రూ. 60 దాటలేదు. అదే శుక్రవారం ఒక్కసారిగా రెట్టింపై రూ. 150 ధర పలికింది.

ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టమాటా దిగుబడి బాగా తగ్గడంతో మదనపల్లె మార్కెట్‌లో టమాటాకు డివూండ్ పెరిగింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌కు చుట్టు పక్కల పల్లెలు, అనంతపురం జిల్లా కదిరి, ముదిగుబ్బ నుంచి, వైఎస్‌ఆర్ జిల్లా రాయచోటి నుంచే కాకుండా కర్ణాటకలోని చింతామణి, చీలగట్టు, శ్రీనివాసపూర్, రాయల్పాడు నుంచి సరుకు వస్తోంది.  ఉత్తరాదికి ఎగుమతి అవుతుండడంతో ఐదు రోజులుగా ధరలు బాగా పుంజుకున్నాయి.

డిసెంబర్ 29న 10 కేజీల బుట్ట ధర మొదటి రకం రూ. 100, రెండో రకం రూ. 70, మూడో రకం రూ. 48 పలికింది.  30న మొదటి రకం రూ. 120, రెండోరకం రూ. 85, మూడో రకం రూ. 60; 31న మొద టి రకం రూ. 130, రెండో రకం రూ. 75, మూడో రకం రూ. 55; జనవరి మొదటి రోజు మొదటి రకం రూ. 140, రెండో రకం రూ. 100, మూడోరకం రూ. 70, 2న మొదటి రకం రూ. 150, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 70 చొప్పున పలికింది. ధరలు పుంజుకుంటుండడంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు