తప్పిపోయిన 20 ఏళ్లకు ప్రత్యక్షం

13 Jan, 2020 08:20 IST|Sakshi
గంగాధర్‌.. 9ఏళ్ల వయస్సులో..

అరకులోయ : విశాఖ ఏజెన్సీలోని అరకులోయలో 2000 సంవత్సరంలో తప్పిపోయిన గంగాధర్‌ అనే గిరిజన యువకుడు 20 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమయ్యాడు. 9ఏళ్ల వయస్సులో గంగాధర్‌ విశాఖ రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో తప్పిపోయి చెన్నైకి చేరుకున్నాడు. అప్పట్లో గంగాధర్‌ ఫొటోతో తప్పిపోయిన బాలుడి పేరిట తమిళనాడు రాష్ట్రంలోని పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అయితే గంగాధర్‌కు చక్ర సెంట్రల్‌ ఆర్గనైజేషన్‌ అనాథాశ్రమం నిర్వాహకులు ఆశ్రయం కల్పించారు. 2015 సంవత్సరం వరకు ఆశ్రమంలోనే వసతితో పాటు చదువు కొనసాగించిన గంగాధర్‌ 2015లో కొంతమంది స్నేహితులతో కలిసి ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు.

ఐటీఐ, కంప్యూటర్‌ కోర్సులను పూర్తి చేసిన గంగాధర్‌ తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఎల్‌ఐసీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో గంగాధర్‌ 15 రోజుల కిందట అరకులోయకు చేరుకుని తన తల్లిదండ్రులు, గ్రామం కోసం వెతుకుతున్నాడు. చిన్న వయస్సులో వెళ్లిపోవడంతో తనకు గిరిజన మ్యూజియం, సినిమాహాలు, గార్డెన్‌ ప్రాంతాలు మాత్రమే గుర్తున్నాయని గంగాధర్‌ తమిళ భాషలో వాపోతున్నాడు. గంగాధర్‌ తల్లిదండ్రులు, గ్రామం ఆచూకీని తెలుసుకునేందుకు స్థానిక పోలీసు అధికారులు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం గంగాధర్‌ పోలీసుల ఆదీనంలో ఉన్నాడు. 

మరిన్ని వార్తలు