మరో నకిలీ మాస్టర్‌ అరెస్టు

22 Sep, 2017 13:19 IST|Sakshi

ఇప్పటి వరకు ఐదుగురు గుర్తింపు
►రూ.1.60 కోట్ల మేర కుంభకోణం
►మిగిలిన వారిని త్వరలోపట్టుకుంటాం : విజిలెన్స్‌ సీఐ


పామర్రు: విజిలెన్సు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించిన తనిఖీల్లో మరో నకిలీ పింఛన్‌ మాస్టర్‌ దొరికారని విజిలెన్సు సీఐ ఎన్‌.శ్రీసాయి అపర్ణ తెలిపారు. పామర్రు శివాలయం వీధిలో నివసించే నకిలీ మాస్టర్‌ యండూరి సాయిబాబుని ఆమె గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ ఎస్పీ రవీంద్రనాథ్, డీఎస్పీ పాల్‌తో కూడిన టీమ్‌ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల విభాగంలో సర్వీసు చేయకుండా, ఉద్యోగ విరమణ పొందినట్లు డాక్యుమెంట్లను తయారుచేసి, 15 ఏళ్లుగా పింఛన్‌పొందుతున్న వారి కోసం దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

పామర్రుకు చెందిన యండూరి సాయిబాబు గతంలో హనుమంతపురంలో ఉండి నాలుగేళ్ల క్రితం నుంచి పామర్రులోని పెదమద్దాలి రోడ్డులోని శివారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఆయన హోమియో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. రిటైర్డు హెచ్‌ఎం కె.రంగరామానుజాచార్యులు 17 ఏళ్ల క్రితం ఆటోలో పరిచయమయ్యాడని, అతనే తన ఇంటికి వచ్చి పెన్షన్‌ పత్రాలు తయారు చేసి వాటిపై సంతకాలు చేయించి ప్రతినెలా పింఛన్‌ వచ్చే ఏర్పాటు చేశారని సాయిబాబు తెలిపారని పేర్కొన్నారు.

ఉద్యోగ విరమణ సౌకర్యాలు, గ్రాట్యుటీకి సంబంధించిన పెద్ద మొత్తాలను మొవ్వ ట్రజరీ కార్యాలయంలో క్యాషియర్‌ నుంచి తీసుకునేలా చేశారని, ఇందుకు గానూ రంగరామానుజాచార్యులకు నెలకు పెన్షన్‌ నుంచి 20 శాతం కమిషన్‌ ఇస్తున్నట్లు సాయిబాబు తెలిపారని చెప్పారు. సాయిబాబు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో సెంకటరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001 అక్టోబర్‌లో ఉద్యోగవిరమణ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని, నవంబర్‌ నుంచి ప్రతి నెలా పింఛన్‌ సాయిబాబు పొందుతున్నాడని సీఐ తెలిపారు.

ఇప్పటి వరకు సాయిబాబు రూ.38 లక్షల వరకు పెన్షన్‌గా తీసుకున్నట్లు తేలిందన్నారు. సాయిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి పెన్షనర్‌ బుక్, బ్యాంకు అకౌంట్‌ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, సాయిబాబుకు రూ.31,344 పింఛన్‌ వస్తోందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు ఐదుగురు నకిలీ టీచర్లను  అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటికి రూ.1.60 కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు.

స్వచ్ఛందంగా ముందుకురావాలి
రంగరామానుజాచార్యుల వలలో పడి, అక్రమంగా పింఛన్‌ పొందుతున్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, వివరాలు తెలియజేస్తే తక్కువ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలి పారు. విజయవాడ ఏలూరు రోడ్డు, వినాయక థియేటర్‌ వద్ద గల విజిలెన్సు ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలపాలని సూచించారు. కార్యాలయం ఫోన్‌ నంబరు 0866–2453757లో కూడా వివరాలు తెలపొచ్చని పేర్కొన్నారు.

రామానుజాచార్యులు కుమార్తె ద్వారా నకిలీ సర్టిఫికెట్‌ట్లు
రంగరామానుజాచార్యులు కుమార్తె కె.పద్మలత పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్‌సీలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా నకిలీ విశ్రాంత ఉపాధ్యాయుల సర్టిఫికెట్‌లను గజిటెడ్‌ హోదాలో అందజేస్తున్నట్లు సమాచారం ఉన్నదని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలిపారు. దాడిలో విజిలెన్సు ఎస్‌ఐ సత్యనారాయణ, వీఆర్వో లంకపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా