మంచైనా..చెడైనా మీతోనే!

12 Jan, 2015 06:22 IST|Sakshi
  • కేసుల నమోదులో జాగ్రత్త
  •  పోలీసు అధికారుల సమీక్షలో హోంమంత్రి చినరాజప్ప      
  • విజయవాడ సిటీ : ‘క్షేత్రస్థాయిలో పని చేసేది మీరే. మంచైనా, చెడైనా మీపైనే ఆధారపడి ఉంది. మీ పని తీరు కారణంగానే పోలీసు కమిషనర్‌కు, ప్రభుత్వానికి పేరొస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పని చేయండి’ అంటూ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు అధికారులకు హితవుపలికారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మంది రంలో ఆయన ఎస్‌ఐ ఆపై స్థాయి అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు.

    సేకరించిన సమాచారం ప్రకారం.. సమావేశంలో హోంమంత్రికి కమిషనరేట్‌లోని అధికారులను సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు పరిచయం చేశారు. ఇతర కమిషనరేట్లలో నేరాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం, వాహనాల కొరత, పోలీసు స్టేషన్ల ఆధునికీకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తాము చేపట్టిన కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక్కడ జరిగే నేరాలు, నిలువరించేందుకు తాము చేపడుతున్న చర్యలను పేర్కొన్నారు.

    ఇన్‌స్పెక్టర్ల పదోన్నతులు, డ్రైవర్ల కొరత, పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, ఆస్పత్రి నిర్మాణం వంటి అంశాలను ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పోలీసుశాఖ పని చేయాలని కోరారు. రాజధాని కావడంతో భూ వివాదాలు పెరిగే అవకాశం ఉందని, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని హోం మంత్రి ఆదేశించారు. పరస్పరం కేసుల నమోదు విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోపణలు రాకుండా కేసుల నమోదు, నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు.
     
    పాఠశాలకు సానుకూలత...వైద్యశాలకు వ్యతిరేకత

    పోలీసు ఉద్యోగుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటుపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. సీఎంతో చర్చించి పాఠశాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో పోలీసుల సంఖ్య పెంపు, వాహనాల సమకూర్చడం వంటి అంశాలపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. పోలీసులకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే సూచనను హోంమంత్రి అంగీకరించలేదు. పెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ‘భద్రత’ పథకం కింద బిల్లులు పెట్టుకునే అవకాశం ఉన్నందున  ఆస్పత్రి అవసరం లేదన్నారు.
     
    ఇసుక మాఫియాకు  చెక్ పెట్టండి

    ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని చినరాజప్ప చెప్పారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టంచేశారు.
     
    సీపీకి కితాబు

    పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సీపీని హోంమంత్రి ప్రశంసించినట్లు తెలిసింది. డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, వివిధ విభాగాలకు చెందిన అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు