మంగంళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార గ్రహిత బాంబే జయశ్రీ

10 Aug, 2019 20:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ : బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమంతా పయనిస్తున్నామని, రాబోయే తరం విద్యార్ధులకు ఆయన ఒక మార్గదర్శకమని ఈ ఏడాది మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార గ్రహిత బాంబే జయశ్రీ పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మంగంళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార ప్రదానోత్సవం శనివారం సాయం‍త్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. మంత్రి అవంతి శ్రీనివస్‌ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు ఈ సంవత్సరానికి 72 కోట్లు కేటాయించాయని అన్నారు. 1981లో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటయిందన్నారు. బాలమురళీకృష్ణ ఫ్రెంచ్ భాషలో కూడా పాటలు పాడారని, వీరు పద్మవిభూషణ్ బిరుదాంకితులని గుర్తు చేసుకున్నారు.

సమకాలీన సంగీత ప్రపంచంలో వెలుగొందుతున్న బాంబే జయశ్రీగారికి ఈ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషమని, జయశ్రీ బహుభాషలలో సినిమా పాటలు పాడారని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..  విజయవాడ వేదికగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషమని, విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా మంగళంపల్లి పనిచేశారని తెలిపారు. విజయవాడలో మొదటి సంగీతయాత్ర మంగళంపల్లి  ప్రారంభించారని, ఈ ప్రాంత ప్రజలే మురళీకృష్ణగారిని బాలమురళీకృష్ణగా సత్కరించారని ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం  కొనియాడారు. సంగీత ప్రపంచంలో జయశ్రీ ఒక ఆణిముత్యమని కీర్తించారు.

మరిన్ని వార్తలు