ఎరువుల కొనుగోళ్లలో ఇష్టారాజ్యం!

17 Oct, 2013 03:36 IST|Sakshi
ఎరువుల కొనుగోళ్లలో ఇష్టారాజ్యం!

సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు యాతన పడాల్సిన దుస్థితి లేకుండా చేయాల్సిన మార్క్‌ఫెడ్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్‌సీజన్‌లోనూ ఎరువులు కొని, నిల్వ ఉంచి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్పట్లో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. అయితే, ప్రస్తుతం మార్క్‌ఫెడ్ ఈ లక్ష్యానికి నీళ్లొదిలి, ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్క్‌ఫెడ్ వ్యవహార సరళి ఇలాగే ఉంటే రాష్ట్రానికి కేటాయించిన ఎరువులను సరఫరా చేయడం తమ వల్ల కాదని క్రిభ్‌కో, ఇఫ్‌కో వంటి సహకార సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
 
 మార్క్‌ఫెడ్‌కు సగం ఎరువులు
 రాష్ట్రానికి సరఫరా చేసే ఎరువుల్లో సగభాగాన్ని క్రి భ్‌కో, ఇఫ్‌కోలు తప్పనిసరిగా మార్క్‌ఫెడ్‌కు అమ్మాలన్న నిబంధన ఉంది. ఖరీఫ్ సీజన్‌లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో.. రబీలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిల్లో ఎరువులకు గిరాకీ ఉంటుంది. ఈ నెలల్లో మాత్రం మార్క్‌ఫెడ్ పట్టుబట్టి తన వాటా కొనుగోలు చేస్తోంది. అంతగా గిరాకీ ఉండని ఇతర నెలల్లో సాకులు చూపుతూ మార్క్‌ఫెడ్ కొనకపోవడం వల్ల తాము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని క్రిభ్‌కో, ఇఫ్‌కో తదితర సంస్థలు వాపోతున్నాయి. అక్టోబర్‌లో క్రిభ్‌కో 24 వేల టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో 12 వేల టన్నులను మార్క్‌ఫెడ్ కొనాలి. తీరా ఓడరేవుల్లోకి వచ్చాక అన్‌సీజన్ పేరుతో మార్క్‌ఫెడ్ యూరియా కొనుగోలు చేయకపోతే ఆ సరకును ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇబ్బంది పడాల్సి వస్తోందని క్రిభ్‌కో అధికారులు వాపోతున్నారు. సీజన్‌లో సగం ఎరువులు మార్క్‌ఫెడ్‌కు విక్రయించి తీరాలని మాపై ఒత్తిడి తెచ్చే వ్యవసాయ శాఖ, అన్‌సీజన్‌లోనూ సగం ఎరువులను కొనాల్సిందేనని మార్క్‌ఫెడ్‌పై మాత్రం వత్తిడి చేయడం లేదు. దీనివల్ల ఖర్చులు రెట్టింపై క్రిభ్‌కో, ఇఫ్‌కో తదితర సంస్థలు నష్టపోవాల్సి వస్తోంది.  
 
 రూ. 500 కోట్ల రుణం ఇప్పించిన వైఎస్సార్
 అన్‌సీజన్‌లో ఎరువులను కొనుగోలు చేసి, జిల్లా స్థాయిలో ఎరువుల నిల్వలు ఉంచి, ఏ నెలలోనూ ఎరువుల కొరత లేకుండా చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. అందుకోసం ప్రభుత్వ పూచీతో మార్క్‌ఫెడ్‌కు రూ.500 కోట్ల వడ్డీలేని రుణాన్ని సయితం వైఎస్సార్ ఇప్పించారు. ఈ రుణంపై వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాకుండా ఎరువుల నిల్వ, రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించేలా నిబంధనలు రూపొందించారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మార్క్‌ఫెడ్ కూడా సీజన్‌లో మాత్రమే ఎరువులు కొంటూ ఫక్తు వ్యాపార సంస్థలా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. అయితే, తమ వద్ద ఇప్పటికే దాదాపు 3 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు పేరుకు పోయాయని మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ ఆదినారాయణ ‘సాక్షి’కి తెలిపారు. అదీకాక తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.157 కోట్ల బకాయిలు వసూలు కానందున మార్క్‌ఫెడ్ ఎరువులు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు.

మరిన్ని వార్తలు