జీవోఎంకు టీజేఏసీ ప్రత్యామ్నాయ నివేదిక | Sakshi
Sakshi News home page

జీవోఎంకు టీజేఏసీ ప్రత్యామ్నాయ నివేదిక

Published Thu, Oct 17 2013 3:40 AM

జీవోఎంకు టీజేఏసీ ప్రత్యామ్నాయ నివేదిక - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ బృందం(జీవోఎం)కు ప్రత్యామ్నాయ నివేదికను సమర్పించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ జేఏసీ సమావేశం బుధవారం జరిగింది. రాజధాని హైదరాబాద్‌తో సహా సాగునీరు, విద్యుత్, విద్య, ఉద్యోగాల పంపిణీ వంటి అంశాలపై కేంద్ర మంత్రివర్గ బృందానికి సమగ్ర నివేదికను అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
 ఈ నెల 20 తర్వాత జేఏసీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లాలని సూచనప్రాయంగా అంగీకరించారు. రంగాల వారీగా అధ్యయనం చేసి నివేదికలను రూపొందించేందుకు కొంత మందిని ఎంపిక చేశారు. అన్ని రంగాలను జేఏసీ చైర్మన్ కోదండరాం సమన్వయం చేస్తారు. జీవోఎం కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందించడానికి ముందుగానే తెలంగాణ జేఏసీ ప్రత్యామ్నాయ నివేదికను అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ గురువారం మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో నాయిని నర్సింహారెడ్డి(టీఆర్‌ఎస్), అశోక్‌కుమార్ యాదవ్, ఎస్.శర్మ(బీజేపీ), కె.గోవర్ధన్, పశ్య పద్మ(న్యూ డెమొక్రసీ), జేఏసీ అగ్రనేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, మాదు సత్యం, బిక్షపతి, రసమయి బాలకిషన్, అశ్వత్థామ రెడ్డి, వెంకటరెడ్డి, బిక్షపతి, దేవీ ప్రసాద్, శేఖర్ రెడ్డి, మాదు సత్యం, విజయేందర్ రెడ్డి, కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఆంక్షలు లేని తెలంగాణ కావాలి: కోదండరాం
 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఆంక్షలు లేని హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ సాధనే తమ లక్ష్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ జేఏసీ కో-కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ అలుపెరగని పోరాటం ఫలితమే తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమన్నారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అల్వాల్ జేఏసీ దీక్షా శిబిరం వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడంలో భాగస్వాములైన వారిని సన్మానించారు.
 
 తెలంగాణ ఏర్పడితే.. సీమాంధ్రుల దుకాణం బంద్
 వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర నేతల వ్యాపారాలు నడవక వారి దుకాణాలు బంద్ అవుతాయని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.  వరంగల్ జిల్లా మద్దూరు మండలం ధూల్మిట్టలో బుధవారం రాత్రి ఆయన జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణను అడ్డుకునేందుకు సీఎం నేతృత్వంలో కుట్ర జరుగుతోందన్నారు.  తెలంగాణ ప్రజల శక్తి ముందు.. ఎన్ని కుట్రలు పన్నినా చెల్లవన్నారు.

Advertisement
Advertisement