వివాహిత దారుణహత్య

17 Jun, 2018 11:45 IST|Sakshi

ఓ వివాహిత మహిళను ఒంటరిని చేసి పదిమంది చుట్టుముట్టి గ్రామం నడిబొడ్డున విచక్షణారహితంగా కట్టెలతో దాడిచేసి హతమార్చారు. అడ్డుకోబోయిన బాలింతను కాళ్లతో తన్ని దాష్టీకానికి దిగారు. ఈ దారుణాన్ని చూసి మనస్తాపానికి గురైన ఆడపడచు ఆత్మహత్యాయత్నం చేసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ ఘటనలతో చాలకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

సోమందేపల్లి: చాలకూరు గ్రామంలో కల్యాణి (36) అనే వివాహిత దారుణహత్యకు గురైంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్యాణి, చిరంజీవి దంపతులు. చిరంజీవి, ఇంటి పక్కనే ఉన్న రాము, రామాంజినప్ప, రామాంజినమ్మలు గత కొద్దిరోజులుగా చిన్నపాటి గొడవలు పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం హిందూపురం వెళ్లిన చిరంజీవిపై రాము, రామాంజినప్పలు దాడి చేశారు. దీంతో బాధితుడు సోమందేపల్లికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకేసామాజిక వర్గానికి చెందిన వీరి మధ్య గొడవను రాజీ చేయించేందుకు శనివారం ఉదయం గ్రామపెద్దలు పంచాయితీ చేశారు. ఆ పంచాయితీ తీర్మానం మేరకు చిరంజీవి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నాడు. 

దాష్టీకం జరిగిందిలా.. 
శనివారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న చిరంజీవి భార్య కల్యాణితో రాము, రామాంజినప్ప, రామాంజినమ్మ, నరసింహప్పలు గొడవకు దిగారు. గ్రామ నడిబొడ్డున దాదాపు పదిమంది ఆమెను చుట్టుముట్టి కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కల్యాణి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దాడిని అడ్డుకునేందుకు బాలింత అయిన మేనకోడలు మంజుల ప్రయ త్నించింది. అయితే ఆ వ్యక్తులు బాలింత అని కూడా చూడకుండా కాళ్లతో తన్నారు. గ్రామ నడిబొడ్డున అందరూ చూస్తుండగా ఇంత ఘోరం జరుగుతున్నా అడ్డుకునేవారే లేరా అంటూ కల్యాణి ఆడపడచు అఖిల ఇంట్లో ఉన్న ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అనంతరం కల్యాణి, అఖిలను హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

చాలకూరులో పోలీస్‌ పికెట్‌ 
వివాహిత హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న పెనుకొండ సీఐ శ్రీనివాసులు, ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి చాలకూరు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని సీఐ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గేవరకు రెండురోజులు పోలీస్‌ పికెట్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు