‘మట్కా’రాణులు

5 Aug, 2015 02:23 IST|Sakshi

మట్కాను పురుషులు ఆడటం, రాయడం సహజం...అయితే కొందరు మహిళలు మట్కా రాయడం, ఏకంగా బీటర్ల అవతార మెత్తడం గమనార్హం.. ప్రొద్దుటూరులో మరో అడుగు ముందుకేసి కంపెనీలను నిర్వహిస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
 
 ప్రొద్దుటూరు క్రైం : మహిళలను గౌరవించడం మన సంప్రదాయం. ప్రభుత్వాలు కూడా వారికి పెద్దపీట వేసి గౌరవిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది కుటుంబ బరువు బాధ్యతలు మోస్తున్నారు. అయితే కొందరు స్త్రీలు కొన్ని కుటుంబాలు ఛిద్రమవడానికి కారణమవుతున్నారు. వాణిజ్య పట్టణంగా పేరు పొందిన ప్రొద్దుటూరులో మట్కా రాజ్యమేలుతోంది. ఒకప్పుడు ఒకటి, రెండు మట్కా కంపెనీలు మాత్రమే ఉండేవి. వారు కూడా మట్కా పట్టీలను తీసుకొని తాడిపత్రికి వెళ్లే వారు. పోలీసులు పట్టించుకోకపోవటంతోనో లేక మట్కాపై ఉన్న ఆసక్తి వల్లనో ఏమో కానీ మట్కా ఆడే వారితో పాటు బీటర్లు కూడా అధికం అయ్యారు. ఆ బీటర్లే ఇప్పుడు కంపెనీలను ఏర్పాటు చేశారు. ఒక్క ప్రొద్దుటూరులోనే సుమారు 100కు పైగా కంపెనీలు ఉన్నాయంటే పోలీసులు మినహా ఎవ్వరూ నమ్మరు.

 30కి పైగా కంపెనీలకు మహిళలే అధిపతులు..
 మహిళలు మట్కా బీటర్లయితే పురుషులతోపాటు మహిళలు కూడా రాస్తుంటారు. అదే పురుషులు బీటర్లయితే మట్కా రాయాలనుకున్న స్త్రీలు రాయలేరు. అందువ ల్లనే ప్రత్యేకంగా మహిళల కోసమే వీరు బీటర్లుగా అవతార మెత్తారు. ఇంట్లో స్త్రీలు రాస్తుంటే పోలీసుల తాకిడి కూడా ఉండదు. రెండేళ్ల వరకు పట్టణంలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే మహిళలు మట్కా రాసేవారు. ఇటీవల కాలంలో వీరి ఆధ్వర్యంలో సుమారు 30కి పైగా కంపెనీలు నడుస్తున్నాయి. నడింపల్లెలో చాలా కాలం నుంచి ఒక మహిళ మట్కా రాస్తోంది. ఈమె టూటౌన్ పోలీస్టేషన్ పరిధిలో ఉంటోంది. ఈమె పేరు తెలియని పోలీసు అధికారి ఉండరు.

చాలా కాలం నుంచి ఈమె మట్కా రాస్తున్నప్పటికీ పోలీసు రికార్డుల్లో చాలా అరుదుగా కనిపిస్తోంది. మరి కొంత మంది మహిళలను అసిస్టెంట్‌లుగా నియమించుకొని మట్కా కంపెనీ నడుపుతోంది. అలాగే పెన్నానగర్‌లో కూడా ఓ మహిళా పెద్ద ఎత్తున మట్కా కంపెనీ నిర్వహిస్తోంది. ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని కాలువకట్ట సమీపంలో నివాసం ఉంటున్న దంపతులు కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరికి పగలు మట్కాకు రూ.5 లక్షలు, రాత్రి మట్కాకు రూ. 7లక్షలు దాకా కలెక్షన్ అవుతుందని విశ్వసనీయ సమాచారం. భర్త బయటి బీటర్ల పట్టీలు తీసుకుంటుండగా, అతని భార్య ఇంటి వద్దనే ఉండి రూ.లక్షలు వ్యాపారం చేస్తుంటుంది.

గతంలో ఆస్తులు అమ్ముకొని జులాయిగా తిరుగుతున్న ఇతను ఇప్పుడు రూ.కోట్లకు పడిగలెత్తినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే విధంగా పెన్నానగర్‌లోని దర్గా వద్ద ఓ మహిళ  మట్కా రాస్తోంది. ఇటీవల ఈమెను అరెస్ట్ చేసిన పోలీసులు రూ. 1.90 లక్షలు దాకా స్వాధీనం చేసుకున్నారు. పవర్‌హౌస్ రోడ్డులోని సీనియర్ మట్కా కంపెనీ నిర్వాహకుడి ఇంట్లో మహిళలే మట్కా రాస్తున్నారు. టూటౌన్ పోలీస్టేషన్ సమీపంలోని శ్రీనివాసనగర్‌లో చాలా కాలం నుంచి ఇద్దరు మహిళలు జూదం నిర్వహిస్తున్నారు. ఇందులోనే లోనే వీరు పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టుకున్నట్లు సమాచారం. కొంపల పుల్లన్న వీధిలో ఒకరు చాలా కాలం నుంచి బీటర్‌గా కొనసాగుతున్నారు. అలాగే నడింపల్లెలోని ప్రముఖ క్రికెట్ బుకీ భార్య మట్కా రాస్తోంది. భర్త క్రికెట్ బెట్టింగ్, భార్య మట్కా రాస్తుండటంతో వారి ఇళ్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ఇలా పట్టణంలో చాలా ప్రాంతాల్లో మట్కా కంపెనీలను నిర్వహిస్తున్నారు.

 పోలీసుల కేసుల్లో కొందరే..
 ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్లు పట్టణంలోని చాలా మంది బీటర్ల వెనుక వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తారని సమాచారం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు కీలక పాత్ర పోషిస్తుంటారు. పట్టణంలో చాలా మంది మహిళలే కంపెనీలు నడుపుతున్నప్పటికీ కేసుల వరకూ వచ్చే సరికి కొందరే కనిపిస్తుంటారు. ఇటీవల కాలంలో వన్‌టౌన్ పోలీస్టేషన్ పరిధిలో మూడు సార్లు మహిళలను అరెస్ట్ చేయగా, టూటౌన్ పరిధిలో రెండు సార్లు మాత్రమే అదుపులోకి తీసుకున్నారు.
 
 ఎవరినీ ఉపేక్షించేది లేదు : డీఎస్పీ పూజిత
 ఈ విషయంపై డీఎస్పీ పూజితా నీలంను సాక్షి వివరణ అడగగా.. పట్టణంలో మట్కా రాస్తున్న వారు ఎవ్వరైనా ఉపేక్షించేది లేదని ఆమె తెలిపారు. మట్కా రాస్తున్న మహిళలను కూడా అరెస్ట్ చేస్తున్నామని చె ప్పారు. మహిళలు ఎక్కడెక్కడ రాస్తున్నారో గుర్తించి, విస్తృతంగా దాడులు చేస్తామని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు