రామాయపట్నంపై జపాన్‌ సంస్థల ఆసక్తి

1 Jul, 2020 04:14 IST|Sakshi

ఏపీలో పది రంగాల్లో భారీ పెట్టుబడులకు సంసిద్ధం 

జపాన్‌ సంస్థలతో మంత్రి గౌతమ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, అమరావతి: రామాయట్నం పోర్టుతో సహా మొత్తం పది కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో  భారీ ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్‌ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం  సచివాలయంలోని తన కార్యాలయంలో జపాన్‌ సంస్థలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ (జేబీఐసీ), జపాన్‌ ప్రీమియర్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్, జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ), ప్రీమియర్‌ జపాన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, కునియమి ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థలు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. 

జపాన్‌ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రంగాలు..  
► రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్‌ డెవలప్‌మెంట్, ఇండస్ట్రియల్‌ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్‌ సంస్థల భాగస్వామ్యం. 
► సోలార్‌ విద్యుత్‌ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్‌ అభివృద్ధి, ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు సంసిద్ధత. 
► ఏపీ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యం, పట్టణాల పునరుద్ధరణ, అభివృద్ధిలో తోడ్పాటు. 
► విశాఖ కేంద్రంగా పెవిలియన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం.  విశాఖలో ఏర్పాటు చేయనున్న స్కిల్‌ సెంటర్,  ఐటీ, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, మౌలిక వసతుల కల్పన, విశాఖను ఐటీ హబ్‌గా మార్చేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం. 
► అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ కో ఆపరేషన్‌) క్రెడిట్‌ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి. 

పరిశీలనలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు (ప్రాథమిక దశ)  
► రామాయపట్నం పోర్టు ద్వారా సరుకు రవాణా, పోర్టు కేంద్రంగా ఇండస్ట్రియల్‌ క్లస్టర్‌ అభివృద్ధి. 
► విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ఇండస్ట్రియల్‌ నోడ్‌ 
► 10 వేల మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు 
► విశాఖపట్నం అభివృద్ధి, మౌలిక వసతులు, స్థిరాస్తి రంగానికి సహకారం. 
► వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎంవో అదనపు ప్రత్యేక సీఎస్‌  పీవీ రమేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ తదితరులు పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు