విలీనంపై మాటమార్చారు!

29 Jul, 2014 09:51 IST|Sakshi

విశాఖ : గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ కార్పొరేషన్లో భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీ విలీనంపై మళ్లీ గందరగోళం నెలకొంది. మంత్రులు కూడా మాట మార్చారు. ఇన్నాళ్లూ తొందర్లోనే విలీన ప్రతిష్టంభనకు తెరపడుతుందని భావించిన అధికారులకు మంత్రులు షాకిచ్చారు. వుడాలో నిన్న జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు.

విలీన పంచాయతీలన్ని విలీనం నుంచి ఉపసంహరించి ఎన్నికలు నిర్వహించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, దీనిపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మూడు మాసాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సమస్యల్ని పరిష్కరిస్తామంటూ భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లూ స్థానిక మంత్రి, భీమిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు స్థానికుల అభిప్రాయం మేరకే విలీనంపై నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పుకొచ్చిన ఆయన మున్సిపల్ మంత్రి సమక్షంలో మాత్రం ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు.

 

మరిన్ని వార్తలు