అసనగిరి కొండల్లో.. ‘అల్లూరి’ గుహలు నిజమే

26 Feb, 2020 11:35 IST|Sakshi
అసనగిరి ప్రాంతంలో ఉన్న గుహలు

ఎట్టకేలకు గిరిజనుల పోరాటానికి మోక్షం

లేటరైట్‌ లీజులపై కూడా ప్రభుత్వానికి మైనింగ్‌ శాఖ ఏడీ నివేదిక

నాతవరం (నర్సీపట్నం):  విశాఖ జిల్లా నాతవరం మండలం అసనగిరి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నివాస గుహలు ఉన్నట్లు మైనింగ్‌ శాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌ జనవరి నెలలో తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులో ఉన్న లేటరైట్‌ నిక్షేపాలు, అల్లూరి గుహలకు సంబంధించి అసెంబ్లీ కమిటీకి లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఆ తర్వాత అసనగిరి ప్రాంతంలోని లేటరైట్‌ గుహలపై రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ కూడా ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు అడ్డగోలుగా జరిపిన లేటరైట్‌ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని అందులో కోరారు. దీనిపై జనవరి 28న అనకాపల్లి మైనింగ్‌ ఏడీ వెంకట్రావు ఆధ్వర్యంలో నాతవరం మండలంలో సుందరకోట పంచాయతీ శివారు అసనగిరి గ్రామ సమీపంలోని అల్లూరి సీతారామరాజు నివాస గుహలను స్వయంగా పరిశీలించారు.

జనవరి 28న అసనగిరిలో గిరిజనులతో మాట్లాడుతున్న మైనింగ్‌ ఏడీ వెంకట్రావు
అక్కడి గిరిజనులతో సమావేశమయ్యారు. బ్రిటిష్‌ కాలంలో అల్లూరి సీతారామరాజు ఈ గుహలో ఉండి.. సైన్యాన్ని తయారుచేసుకుని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు పోలీసుస్టేషన్లపై దాడి చేశారని గ్రామస్తులు తెలిపారు. కాగా, ఈ గుహలను అభివృద్ధి చేయాలంటూ ఈ ప్రాంత గిరిజనులు ఏళ్ల తరబడి డిమాండ్‌ చేస్తున్నారు. వీటిని పట్టించుకోకుండా గత ప్రభుత్వం.. ఈ ప్రాంతంలో లేటరైట్‌ నిక్షేపాల తవ్వకాలకు నిబంధనలు ఉల్లంఘించి సింగం భవాని పేరు మీద అనుమతులిచ్చింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కొంతమంది టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షలాది టన్నుల లేటరైట్‌ మట్టిని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మీదుగా యథేచ్ఛగా తరలించుకుపోయారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత కొందరు కోర్టును ఆశ్రయించడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. గుహలున్న ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులో ఉంది. ఈ నేపథ్యంలో.. విశాఖ జిల్లాలో అసనగిరి గ్రామస్తులు చేస్తున్న పోరాటంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌ స్పందించి అసెంబ్లీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ తాము పరిశీలించిన అంశాలతో పాటు అసనగిరి గ్రామస్తులు తెలిపిన విషయాలన్నింటినీ ప్రభుత్వానికి ఇటీవల మైనింగ్‌ ఏడీనివేదించారు.

మరిన్ని వార్తలు