వరుసగా రెండో రోజూ తగ్గిన పసిడి ధర

26 Feb, 2020 11:41 IST|Sakshi

సాక్షి,ముంబై:  ఆల్‌టైం గరిష్టాలను తాకిన పుత్తడి ధరలు వరుసగా రెండో రోజుకూడా దిగి వచ్చాయి.  మంగళవారం ఏకంగా వెయ్యిరూపాయల మేర తగ్గిన పసిడి ధర నేడు (బుధవారం) మరింత తగ్గింది. వెండి ధరలు కూడా  ఇదే బాటలో ఉన్నాయి. ఏడేళ్ల గరిష్టంతో అత్యధిక స్థాయిల్లో ఇన్వెస్టర్ల  ప్రాఫిట్‌ బుకింగ్‌ కారణంగా  పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్‌ వర్తకులు పేర్కొన్నారు. అలాగే వినియోగదారుల డిమాండ్‌పై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కనిపిస్తున్న కారణంగా బంగారు రేటు సమీప కాలంలో కొంత అస్థిరతకు గురయ్యే అవకాశం వుందని విశ్లేషకులంటున్నారు.

ముఖ్యంగా కోవిడ్‌-19, చమురు ధరల ప్రభావంతో వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధర బుధవారం దేశీ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.300 తగ్గి రూ.42,570 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వెండి ధర కూడా కిలోకు సుమారు రూ. 500 క్షీణించింది. ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ 1.2 శాతం పడి  కిలో ధర రూ. 47,020 కు చేరుకుంది.  అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 16 డాలర్లు తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,642 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలతో కీలక మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ఆరంభంలోనే 400 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 40 వేల పాయింట్ల దిగువకు చేరగా, నిఫ్టీ కూడా 100 పాయింట్లకు పైగా కోల్పోయి 11700 దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కాగా డాలరు మారకంలో రూపాయి 11 పైసలు  లాభంతో 71.74 వద్ద  ట్రేడ్ అవుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా