టీడీపీ ఎమ్మెల్యేల హంగామా

24 Aug, 2017 02:03 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్యేల హంగామా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హంగామా సృష్టించారు. బుధవారం ఉదయం పోలింగ్‌ ప్రశాంతంగానే మొదలైనప్పటికీ.. పోలింగ్‌ శాతం పెరిగేకొద్దీ అధికారపార్టీలో అసహనం ఎక్కువైంది. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తూ తమ పార్టీకి ఓటేయాలంటూ బాహాటంగానే ప్రజల్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల నిబంధనలను తోసిరాజని కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు, బనగానపల్లె, అనపర్తి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మంత్రి అఖిలప్రియ సైతం రంగంలోకి దిగి నంద్యాల పట్టణంలో పలువార్డుల్లో పర్యటించారు. ఇంత చేస్తున్నా వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగమౌనిక అయితే పోలింగ్‌ కేంద్రాల్లో దుర్భాషలాడుతూ హంగామా సృష్టించడం గమనార్హం.
 
ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు: అధికారపార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలను సైతం పట్టించుకోకుండా నంద్యాల నియోజకవర్గంలో ఇష్టానుసారంగా తిరిగారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చాపిరేవులలో పర్యటించి పార్టీ నేతలతో మాట్లాడి ఓట్లేయించే ప్రయత్నం చేశారు. ఇక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి గోస్పాడు మండలంలోని యాళ్లూరులో ఏకంగా డీఎస్పీతోనే మాటామంతీ నిర్వహించారు. అదేరీతిలో కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖరరెడ్డిలు పట్టణంలోని నడిగడ్డ, ఎన్‌జీవో కాలనీలలో ప్రధానంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు పదేపదే మీడియాలో రావడంతో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. 
 
అదేబాటలో మంత్రి..: మంత్రి అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ నుంచి నంద్యాలలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి నంద్యాలకు చేరుకున్న ఆమె అనంతరం టీవీలకు అక్కడి అద్దెభవనం నుంచి ఇంటర్వ్యూలిచ్చారు. అంతేకాక దర్జాగా నంద్యాల నడివీధుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు.