మార్చురీలో ఎలుకలపై విచారణ

31 Jan, 2020 13:15 IST|Sakshi
ఏలూరులో మార్చురీ గదిని పరిశీలిస్తున్న ఆర్డీ వాణి, చిత్రంలో డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌ఓ

మృతదేహం కనుగుడ్లు తినేయడంపై మంత్రి ఆళ్ల నాని సీరియస్‌  

ఏలూరు జిల్లా ఆస్పత్రిలోఆర్డీ విచారణ  

మార్చురీ నిర్వహణ సంస్థ ఈగిల్‌ హంటర్‌కు నోటీసులు

ఏలూరు టౌన్‌:  ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహం కనుగుడ్లు, కనురెప్పలను ఎలుకలు తినివేసిన సంఘటనపై ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్‌ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యవిధాన పరిషత్‌ రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వాణి, ఏపీ మెడికల్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ దిరిశాల వరప్రసాదరావు విచారణ చేశారు. మార్చురీ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కె.శంకరరావు, డీఎంహెచ్‌ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆ సుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఏఎస్‌ రామ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి మార్చురీ నిర్వహణ ఎలా ఉందో స్వయంగా తనిఖీ చేశారు. మార్చురీలోని ఫ్రీజర్‌ బాక్సులను, సౌకర్యాలను గమనించారు. ఫ్రీజర్‌ బాక్సులకు రంధ్రాలు ఉండటాన్ని చూసి రీజనల్‌ డైరెక్టర్‌ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలుకలు ఎందుకు వెళ్లకుండా ఉంటాయంటూ వైద్యాధికారులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగంటూ అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. 

ఫ్రీజర్‌ బాక్సులకు మరమ్మతులు
ఆసుపత్రి ప్రాంగణంలోని రెండు మార్చురీ గదులను పరిశీలించామని, ఒక గదిలో సరిగా సౌకర్యాలు లేకపోవటంతో దానిని సీజ్‌ చేయాలని ఆదేశించినట్టు ఆర్డీ వాణి తెలిపారు. ఫ్రీజర్‌ బాక్సులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించామని, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి పారిశుధ్య విభాగానికి సంబంధించి ఫెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్ట్‌ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ బోర్డు మెంబర్‌ డాక్టర్‌ దిరిశాల వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని, పూర్తి జాగ్రత్త తో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈగల్‌ హంటర్‌ అనే సంస్థకు ఫెస్ట్‌ కంట్రోల్‌ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలుకలు, పాములు, పందులు, కుక్కలు, క్రిమికీటకాలు లేకుండా ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటమే వారి బాధ్యత అన్నారు. ఈ ఫెస్ట్‌ కంట్రోల్‌ సంస్థకు నెలకు రూ.40 వేలు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. సంస్థ ఇద్దరు సిబ్బందిని నియమించి, రాత్రి, పగలు పనిచేసేలా చూస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావును బాధ్యతల నుంచి తొలగించామని, వేరే సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్‌ ౖచైర్మన్‌ జయప్రకాష్, ఆర్‌ఎంవో తవ్వా రామ్మోహనరావు, క్వాలిటీ మేనేజర్‌ మనోజ్‌ తదితరులు ఉన్నారు.  

మరిన్ని వార్తలు