బ్రాండ్‌థాన్‌తో ఏపీకి బ్రాండింగ్‌

4 Oct, 2019 04:17 IST|Sakshi

దేశ ఆర్థికవృద్ధిలో ఏపీ ముద్ర ఉండేలా చేస్తాం

ఇందుకోసం అన్ని వర్గాలను భాగస్వామ్యం చేస్తాం

బ్రాండింగ్‌ పెంచే వినూత్న ఆలోచనలు ఇవ్వండి 

ఎంపికైన అత్యుత్తమ ఆలోచనలకు బహుమతులు

దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్‌ 28 

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం సదస్సులో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి 

సదస్సుకు హాజరైన రాష్ట్ర ఆరి్థక మంత్రి బుగ్గన

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం బ్రాండ్‌థాన్‌ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరికొత్త ఆలోచనలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పారదర్శకత, సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పమని మంత్రి తెలిపారు. ఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సులో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మంత్రి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. పీవీ రమేష్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డా. రజత్‌ భార్గవ పాల్గొన్నారు.  మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. నైపుణ్యంలేని ఉద్యోగాలు అందించడం కాకుండా ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణనిచ్చి స్థానికులకే 75 శాతం ఉద్యోగాలను అందించేందుకు శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 

యువత నుంచి సూచనలు ఆహ్వానం
ఏపీకి సరికొత్త బ్రాండింగ్‌ను సృష్టించే దిశగా ‘బ్రాండ్‌థాన్‌’ను నిర్వహించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి సృజనాత్మక యువత నుంచి సూచనల ఆహ్వానించినట్లు తెలిపారు. అక్టోబర్‌ 3 నుంచి 28 వరకు ఎంట్రీలను httpr://bit.  y/2m1KVml పోర్టల్‌లో స్వీకరించనున్నట్లు మంత్రి వివరించారు. అత్యుత్తమ ఆలోచనల్లో మొదటి బహుమతికి రూ.50 వేలు, రెండో బహుమతికి రూ.25 వేలు, మూడో బహుమతికి రూ.10వేలు నగదు బహుమతి అందజేస్తామని గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అంతకుముందు.. దేశాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు గల ఏకైక పట్టణం విశాఖపట్నమని అన్నారు. ప్రస్తుతం అమరావతిని పాలనా పరంగా అనుకూలమైన నగరంగా మలచుకుంటున్నట్లు వెల్లడించారు.

హిండ్‌వైర్, మిత్సుబిషి సంస్థలతో భేటీ
సదస్సు సందర్భంగా హిండ్‌వైర్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్, జపాన్‌కు చెందిన మిత్సుబిషి ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ ప్రతినిధులు మంత్రి మేకపాటితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్న నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతో మేకపాటి చర్చించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ కూడా పాల్గొన్నారు.

13 జిల్లాల్లో ఇండస్ట్రియల్‌ జోన్లు
బ్రాండ్‌థాన్‌తో పారిశ్రామికవృద్ధిని పరుగులు పెట్టించేందుకు కృషిచేయనున్నట్లు మేకపాటి వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారని.. పారదర్శకతను ఆచరణలో చూపుతున్న ఏపీలో వాణిజ్యానికి పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారన్నారు వివరించారు. రాష్ట్రంలో 31 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాలను ఇండస్ట్రియల్‌ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆయన  తెలిపారు. రానున్న ఐదేళ్లలో 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమి తీసుకురావడమే ధ్యేయంగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఏపీ తనదైన ముద్ర వేస్తుందనడంలో సందేహం లేదన్నారు.  

మరిన్ని వార్తలు