‘దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు చర్యలు’

9 Nov, 2019 16:48 IST|Sakshi

మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, కాకినాడ: దేవాదాయ,ధర్మాదాయ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దేవుని ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ భూములు,ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తాం’ అని కన్నబాబు తెలిపారు. కాకినాడ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో కొందరు దేవాదాయ భూములను అన్యాక్రాంతం చేశారని అన‍్నారు.

భావనారాయణ స్వామి ఆలయం, భగ్గవరపు సత్రం, అన్నదాన సమాజం, నుకాలమ్మ మాన్యంకు చెందిన కొన్ని భూములు అన్యాక్రాంతం అయినట్లు గుర్తించామని వెల్లడించారు. వాటిలో కొన్నింటిని వెనక్కి తీసుకుని ఆయా ఆలయాలకు అప్పగించామని చెప్పారు. ఇంకా ఆక్రమణల్లో ఉన్న భూములు, ఆస్తులను గుర్తించి వాటిపై అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు