ఏపీ ప్రభుత్వం ముమ్మర యత్నాలు

2 May, 2020 19:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని కాసిమేడ్‌ ప్రాంతంలో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఏపీ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మత్స్యకారులను ఏపీకి తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నామని.. ఆందోళన పడొద్దని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వారిని స్వస్థలాలకు చేరుస్తామని పేర్కొన్నారు. రైళ్లు, రోడ్డు మార్గం ద్వారా మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు.
(ఏపీలో 8 కొత్త ఫిషింగ్‌ హార్బర్లు)

గుజరాత్‌లో చిక్కుకున్న మన రాష్ట్ర మత్స్యకారులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్రానికి చెందిన 4,068 మంది మత్స్యకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు 2,911 మంది ఉండగా, విజయనగరం జిల్లాకు చెందిన వారు 711, విశాఖపట్నం జిల్లాకు చెందినవారు 418, తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు 13 మంది, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారు ఒకరు, ఒడిశాలో ఉంటున్న మరో 14 మంది ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుజరాత్‌లో నిలువ నీడ లేక, తినడానికి తిండి లేక 37 రోజుల పాటు వీరంతా అష్టకష్టాలు పడ్డారు. వారి కుటుంబసభ్యుల వినతి మేరకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో మాట్లాడారు. మత్స్యకారులను రాష్ట్రానికి తరలించడానికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులకు రాష్ట్రానికి తీసుకురావడానికి రూ.3 కోట్లు విడుదల చేయించారు.
(విదేశాంగమంత్రికి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ)

మరిన్ని వార్తలు