పార్టీ మారినందుకు మంత్రి పుల్లారావు వేధింపులు  

13 Apr, 2019 08:15 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీలో చేరిన టీడీపీ నేతపై మంత్రి పుల్లారావు అరాచకం 

మార్కెట్‌ యార్డులో వ్యాపారం నిలిపివేయాలంటూ ఆదేశాలు 

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయని నాయకులపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అప్పుడే వేధింపులు మొదలుపెట్టారు. పోలీస్, మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఇందుకోసం వినియోగించుకుంటున్నారు. చిలకలూరిపేట టీడీపీ అధ్యక్షునిగా పనిచేసిన మల్లెల రాజేష్‌నాయుడు నెల రోజుల క్రితం వైఎస్సార్‌ సీపీలో చేరటంతో ఆయనపై వేధింపులు మొదలయ్యాయి. పట్టణంలో తనకంటూ ప్రత్యేక వర్గం కలిగిన రాజేష్‌నాయుడు ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి విడదల రజినికి అనుకూలంగా ప్రచారం చేశారు. ఫలితంగా తన గెలుపు అవకాశాలు తగ్గిపోవడంతో మంత్రి పుల్లారావు ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. చిలకలూరిపేట మార్కెట్‌ యార్డులో పశువుల కొనుగోళ్లు, అమ్మకాలు నిర్వహిస్తున్న రాజేష్‌ ఇకపై ఆ వ్యాపారం చేయకూడదంటూ మార్కెటింగ్‌ శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేయించారు.

ఎన్నికల నియమావళి అమలులో ఉన్న తరుణంలో మంత్రి పుల్లారావు అధికారులపై ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారని.. ఎటువంటి కారణాలు చూపకుండానే అధికారులు తాను చేస్తున్న వ్యాపారానికి ఆటంకాలు కలిగిస్తున్నారని రాజేష్‌నాయుడు ఎన్నికల అధికారులకు, సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట మార్కెట్‌ యార్డులో గ్లోబల్‌ మర్చంటైజ్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో రాజేష్‌నాయుడు చాలాకాలంగా పశువుల కొనుగోలు, అమ్మకాలు చేస్తున్నారు. ప్రతి అమ్మకంపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెస్‌ చెల్లిస్తున్నారు. మార్కెట్‌ కమిటీ కార్యదర్శి సువార్త ఆయన కార్యాలయానికి ఫోన్‌చేసి, శనివారం సంతలో పశువుల క్రయ, విక్రయాలు చేయకూడదని ఆదేశించారు.

తమ సంస్థ ఎందుకు వ్యాపారం నిలిపివేయాలో కారణాలు చెప్పాలని, దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా నోటీసు ఇవ్వాలని రాజేష్‌ కోరారు. అవేమీ తనకు తెలియదని, వ్యాపారం నిర్వహించకూడదని ఆమె హెచ్చరించారు. దీంతో రాజేష్‌ జిల్లా అధికారులకు, ఎన్నికల ప్రధానాధికారికి, హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. మంత్రి పుల్లారావు తనపై వేధింపులకు దిగుతున్నారని, వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై మార్కెట్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సువార్తను ‘సాక్షి’ వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదన్నారు. ఇప్పటివరకు ఆయన వ్యాపారానికి సంబంధించిన రికార్డులను అడిగామన్నారు. రాజేష్‌నాయుడు మాట్లాడుతూ.. తన కార్యాలయ ఉద్యోగి భూపతిని ఆమె కార్యాలయానికి పిలిపించుకుని వ్యాపారం చేయొద్దని ఆదేశించారన్నారు. శనివారం సంతలో వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్టు ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు